మనం సాధారణంగా పండిన టమోటలతో ఎక్కువగా వంటలు చేసుకుంటాం. అయితే పచ్చి టమాటాలతో చాలా కొన్ని చోట్ల మాత్రమే వండటం కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పచ్చి టమోటాలతో పచ్చడి చేయడం చూస్తూ ఉంటాం. ఇది ఎంతో రుచికరంగా కూడా ఉంటుంది. పండిన ఎర్ర టమోటాల్లా పోషకమైనవి కానప్పటికీ, పచ్చి టమోటాలు అనేక పోషక ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఈ పచ్చి టమోటాలను గ్రీన్ సలాడ్‌లో మాంసాహార వంటల్లో చేర్చుకోవడం పాశ్చాత్య దేశాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. వీటివల్ల విటమిన్లు మరియు ఖనిజాలను పుష్కలంగా పొందవచ్చు. ఈ పచ్చి టమోటాలలో ఉన్న పోషకాలు, విటమిన్లు, వాటి ప్రయోజనాలు చూడండి మరి.
విటమిన్ సి
పండిన, ఎర్రటి టమోటాలు విటమిన్ సి ని సమృద్ధిగా కలిగి ఉంటాయి. అయితే పచ్చి టమోటాలలో అంత మోతాదులో విటమిన్ సి లేనప్పటికీ శరీరానికి అవసరమైనంత విటమిన్ ను ఇవ్వగలవు. ఒక కప్పు పచ్చి టమోటాలలో సి విటమిన్, 42 మిల్లీగ్రాముల వరకు కలిగి ఉంటుంది. విటమిన్ సి పుష్కలంగా తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది కాబట్టి శరీరం జలుబు, ఫ్లూ మరియు ఇతర అనారోగ్యాలను సులభంగా ఎదుర్కోగలదు. అలాగే దంతాలు, చిగుళ్ళు, ఎముకలు మరియు చర్మం మొదలైనవాటి ఆరోగ్యానికి విటమిన్ సి కూడా చాలా ముఖ్యమైనది. పచ్చి టమోటాలను ఆహారంలో భాగంగా వివిధారకాలుగా వండుకుని తీసుకోవడం వల్ల విటమిన్ సి గణనీయంగా పొందవచ్చు.
ఫైబర్
పచ్చి టమోటాలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో అవసరమైనది. పేగు మరియు జీర్ణ వ్యవస్థల ఆరోగ్యం సమర్థవంతంగా ఉండటానికి ఈ ఫైబర్ దోహాధం చేస్తుంది. ఒక కప్పు పచ్చి టమోటాలలో 2 గ్రాముల డైటరీ ఫైబర్‌ను కలిగి ఉంటుంది. ఫైబర్ చాలా పండ్లు, కూరగాయలు మరియు తృణధాన్యాల్లో ఉండేదే అయినా పచ్చి టమాటాలలో ఉండే ఫైబర్ పూర్తిగా పక్వం చెంది ఉండదు కాబట్టి ఇది మరింత సమర్థవంతమైన పాత్రను పోషిస్తుంది. రోజువారీ మనకు లభించే వాటితో పాటు పచ్చి టమాటాలను కూడా వంటల్లో భాగం చేసుకోవడం వల్ల మలబద్దకం, పేగు సంబంధ సమస్యలు, జీర్ణాశయ ఆరోగ్యం మొదలైనవాటికి ఈ ఫైబర్ అత్యుత్తమమైనది. ఇంకా గుండె జబ్బులు, పెద్దప్రేగు క్యాన్సర్ మరియు టైప్ 2 డయాబెటిస్ తో సహా అనేక ప్రాణాంతక పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఈ ఫైబర్ సహాయపడుతుంది.
బీటా కారోటీన్
బీటా కెరోటిన్ సాధారణంగా పండిన టమాటాల్లో ఉన్నట్టే పచ్చి టమాటాల్లో కూడా సమృద్ధిగా ఉంటుంది. రెండింటిలో బీటా కెరోటిన్ సమాన స్థాయిలో ఉంటుంది. బీటా కెరోటిన్ చాలా పండ్లు మరియు కూరగాయలలో ఉన్నప్పటికి పచ్చి టమాటాల్లో ఉన్న బీటా కెరోటిన్ విటమిన్ ఎ ఉత్పత్తికి గొప్పగా సహాయపడుతుంది. విటమిన్ ఎ కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడటానికి మరియు తెల్లరక్తకణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. మరియు సరైన కణ విభజనను ప్రోత్సహిస్తుంది. పచ్చి టమోటాలు 1 కప్పు తీసుకోవడం ద్వారా 623 మైక్రోగ్రాముల బీటా కెరోటిన్ లభిస్తుంది.
ఇతర పోషకాలు
1-కప్పు పచ్చి టమాటాలలో అనేక అదనపు పోషకాలు కూడా పొందవచ్చు, వాటిలో 23 మిల్లీగ్రాముల కాల్షియం మరియు 367 మిల్లీగ్రాముల పొటాషియం ఉన్నాయి. అలాగే ప్రోటీన్, మెగ్నీషియం, భాస్వరం మరియు విటమిన్ కె కూడా పొందవచ్చు.
చివరగా…..
పచ్చి టమాటాలు గ్రామీణ సంప్రదాయ వంటకాల్లో విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు.వీటినుండి గొప్ప ఆరోగ్యం చేకూరుతుంది కాబట్టి దొరికితే అసలు వదలకండి.