వంటల్లో కొత్త కొత్త ప్రయోగాలు పుడుతున్న కొద్ది ఆహారాన్ని తీసుకునే విధానం కూడా మారింది. డైటింగ్ పేరుతో కొందరు జీర్ణాశయానికి ఇబ్బంది కలిగించే వాటిని పచ్చిగా తింటారు, రుచి పేరుతో కొందరు పచ్చిగా తినదగిన వాటిని ఉడికించి మసాలాలు జోడించి మరీ తింటారు.
అసలు పచ్చిగా తీసుకోదగిన పదార్థాలు, ఆకుకూరలు, కూరగాయలు ఏమైనా ఉన్నాయా?? అలాగే కేవలం ఉడికించి మాత్రమే తీసుకోవలసిన ఆహార పదార్థాలు ఏమిటి?? ఒకసారి తెలుసుకోండి. లేకపోతే ఆరోగ్యం అస్తవ్యస్తంగా ఊగిలాడుతూ ఉంటుంది.

పచ్చిగా తినదగినవి.
సాధారణంగా పచ్చిగా తినే పదార్థాలు బోలెడు ఉంటాయి. వాటిలో పండ్లను మినహాయిస్తే క్యాబేజీ, క్యారెట్, మొలకెత్తిన గింజలు, ఇంకా కీరా దోసకాయ, టమాటా వంటివి కలిపి సలాడ్ లాగా చేసుకుని డైటింగ్ పేరుతో తింటుంటారు. అయితే ఇక్కడ అందరూ ఒకటి గమనించాలి. ఇప్పట్లో పురుగుల మందుల ప్రభావం అధికంగానే ఉంటుంది పంటల మీద కాబట్టి క్యాబేజీ ని వీలైనంతవరకు అవిరిమీద ఉడికించి తినడం ఉత్తమం. ఇంకా మొలకెత్తిన గింజలతో చాలామంది కట్లెట్లు, కర్రీలు చేసుకుని తింటుంటారు. దీనివల్ల మొలకల్లో ఉన్న పోషకాలు నశించిపోతాయి. అంతేకాదు మొలకలు వేడికి గురైతే అవి నశించడంతో పాటు విషపూరితంగా మారి అనారోగ్యాన్ని కలిగించే అవకాశం కూడా మెండుగా ఉంటుంది.
కీరదోస, టమాటా, క్యారెట్ లాంటివి నేరుగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అందులో ఉన్న పోషకాలు సమర్థవంతంగా అందుతాయి. కానీ వాటికి కాసింత ఉప్పు, నిమ్మరసం, కారం అంటూ అన్ని దట్టించి కలగలిపి తీసుకోవడం వల్ల ఒక పదార్థం మరొక దానితో వ్యతిరేక ప్రభావాన్ని చూపే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
అలాగే పుదీనా, కొత్తిమీర వంటివి జ్యుస్ చేసుకుని తాగడం వల్ల మహిళల్లో ఎదురయ్యే కొన్ని సమస్యలకు మంచి ఔషధంగా పని చేస్తాయి.

ఉడికించి తినాల్సినవి.
దుంపల్లో కార్బోహైడ్రేట్స్, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని ఉడికించి తినడం మంచిది. అలాగే కీటో డైటింగ్ పేరుతో కొందరు మాంసహరాన్ని మాత్రమే తీసుకుంటూ ఉన్నవాళ్లు ఉడికించి తినడం ఉత్తమం. ఇంకా కాయగూరలు, ధాన్యాలు ఉడికించి తీసుకోవాలి.
చాలామంది మాంసాన్ని కబాబ్ ల లాగా, కాల్చుకుని తింటుంటారు. దీనివల్ల లోపల భాగం ఉడికినట్టు అనిపించినా అది తిన్న తరువాత జీర్ణం కావడానికి జీర్ణాశయం చాలా సమయం తీసుకుంటుంది, అంతేకాదు ఇలా చాలా సమయం తీసుకునే పదార్థాలే ఫ్యాట్ లు గా మారి పొట్ట, పిరుదులు వంటి ప్రాంతాల్లో చేరి అధిక బరువుకు దారితీస్తాయి.
మానవ శరీరానికి అనుగుణంగా మనం రోజువారీ తీసుకునేవాటిలో పండ్లు మినహాయిస్తే మిగిలిన పదార్థాలు అన్ని 90% ఉడికించి తీసుకోవడం శ్రేయస్కరం. దీనివల్ల జీర్ణాశయం కు సంబంధించిన సమస్యలను దూరంగా ఉంచవచ్చు.
చివరగా…..
పచ్చిగా తీసుకునే ఆహారం ఆరోగ్యానికి ఉత్తమైనది అయినప్పటికీ, అధిక పోషకాలు ఫ్యాట్ లు కలిగిన పదార్థాలను ఉడికించి తీసుకోవడం వల్ల మన శరీరానికి తగ్గట్టు పోషకాలను మనమే మైంటైన్ చేసుకోవచ్చు. ప్రయోగాల పేరుతో, రుచి కోసం ఆహార పదార్థాలను తీసుకునే విధానం మార్చేయకండి. దానివల్ల వాటి నుండి లభించే గుణాలు వ్యతిరేకంగా పనిచేస్తాయి లేక ఉపయోగం లేకుండా ఉండచ్చు కూడా.