real health benefits of turdal kandipodi

కంది పొడి గూర్చి కమ్మకమ్మని విషయాలు……

పప్పు, పులుసు, సాంబార్, చారు శాఖాహార వంటల్లో తప్పకుండా ఏదో ఒకటి ఉంటుంది ఇంట్లో. ఇక పండగ పబ్బం అంటే ఘుమఘుమలు తప్పనిసరి. వీటన్నింటిలోకి కందిపప్పు తప్పనిసరి. అయితే ఈ కందిపప్పును ఇలా కూరల్లానే కాకుండా దోరగా వేయించి రోట్లో వేసి దంచితే వచ్చే కమ్మని వాసన, వేడి వేడి అన్నంలో కాసింత నెయ్యి వేసుకుని దంచుకున్న పొడిని కొద్దిగా వేసి బాగా కలుపుని తింటే ఆ రుచికి బ్రహ్మ దేవుడే ఫిదా అవుతాడేమో. ఇంత రుచి గల కందిపొడి గూర్చి కొన్ని కమ్మని విషయాలు చదవండి.

కందిపొడిని కందిసున్ని, కమ్మపొడి ఇలా పిలుస్తారు. అయితే చాలామందికి కందిసున్ని అంటేనే ఎక్కువ తెలుసు. ఇందులో కొద్దిగా వేరుశనగ పప్పులు, ఉలవలు కూడా వేయించి కలిపిన పొడి ఎక్కువ ప్రయోజనాత్మకంగా ఉంటుంది. రుచిని పెంచడమే కాకుండా బలాన్ని కలిగిస్తుంది. ప్రొద్దునపూట వేడి అన్నంలో ఈ పొడిని కలుపుకుని కాసింత నెయ్యి వేసుకుని తింటూ ఉంటే శరీరం బలంగా తయారవుతుంది. టిఫిన్లు కంటే 100%  మేలైనది. అంతేకాదు పేగులు శుభ్రపరిచి పేగులు ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.

అబ్బో కందిపొడువుకు మాత్రం బలే గర్వం అని ఆరుద్ర గారు చమత్కరిస్తారు. కందిపొడిని శిక్షిస్తారు, భక్షిస్తారు అంటూ అందులో కూడా కవిత్వాన్ని జోప్పిస్తారు. 

  సాధారణంగా ఏదైనా పదార్థం తినడం వల్ల ఒకోసారి మన జీర్ణ వ్యవస్థ సరిగా లేనపుడు అజీర్తి కలగడం వంటిది జరుగుతుంది. ఆయుర్వేద భాషలో దీన్నే దోషం అంటారు.  కందిపప్పుతో  చేసే ఏ వంటకం ను తినడం వల్ల అయినా దోషం కలగకుండా ఉండాలంటే తినేటప్పుడు కాసింత నెయ్యి వేసుకుంటే ఎలాంటి దోషాలు దరిచేరవని ఆయుర్వేదం చెబుతుంది. కందిపచ్చడితో పాటు పచ్చి పులుసు  సహాబోజన పదార్థంగా పిలవబడుతుంది. ఎందుకంటే నెయ్యి అందుబాటులో లేని పక్షంలో కందిపప్పు కలిగించే ఇబ్బందికి పచ్చిపులుసు చక్కని  ఔషధంగా పనిచేస్తుంది.

 వాము పొడి, శొంఠి పొడి, కరక్కాయ బెరడు పొడి,  మూడింటిని సమానభాగాలుగా తీసుకుని కలిపి తగినంత ఉప్పు వేసుకుని ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.  ప్రతిరోజు బోజనం అయిన తరువాత ఒక గ్లాసు మజ్జిగలో  ఒక చెంచా పొడిని కలిపి కలిపి తాగుతుంటే అజీర్తి ఆమడ దూరం పారిపోతుంది. ముఖ్యంగా కందిపప్పు వల్ల కలిగే ఇబ్బందికి ఇది ఉత్తమమైన విరుగుడుగా పనిచేస్తుంది.

  ముఖ్యంగా కందిపొడి తయారుచేసుకునేటపుడే కాసింత ఇంగువను, జీలకఱ్ఱను జతచేసి  తయారుచేసుకోవాలి.  ఇది ఆరోగ్యానికి చాలా ఉత్తమైనది మరియు కందిపొడికి అదనపు ప్రయోజనాలను చేకూరుస్తుంది.

చివరగా…….

కందిపొడి అనేది ఆరోగ్యానికి ఎంతో ఉత్తమమైన ఫలితాలను అందించే గొప్ప ఆహారపదార్థం. మన పెద్దలు మనకు అందించిన గొప్ప వరం. కాబట్టి దీని విలువ తెలుసుకుని ఆహారంలో భాగం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

Leave a Comment

error: Content is protected !!