ఆరోగ్యం చేయి జారితే తప్ప, సమస్య మన వరకు లేదా మన వాళ్ళ వరకు వస్తే తప్ప మనకు ఆరోగ్య స్పృహ పెరగదు అనేది అక్షరాల నిజం. నేటి కాలంలో 30 ఏళ్ళు కూడా రాకుండానే షుగర్లు, బిపి లు అటాక్ చేస్తున్నాయి. మహిళల్లో రక్తహీనత, హార్మోన్ల సమస్యలు, గర్భాశయ వ్యాధులు. పురుషుల్లో లైంగిక సామర్థ్యము తగ్గడం, మానసిక ఒత్తిడి మొదలైనవి ఎన్ని అల్లోపతి మందులు వాడినా తగ్గకుండా వేధిస్తూనే ఉంటాయి. అయితే అందరికి ఇపుడు ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగి రొట్టెలు, పచ్చి కూరలు, లాంటివి తింటూ రూట్ మార్చారు. కానీ కొందరు మాత్రం పాత పద్ధతులకు వెళ్ళిపోయి ఆరోగ్య సూత్రాన్ని ఫాలో అవుతూ సిరిధాన్యాల అద్భుతాలను రుచి చూస్తూ ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నారు.
అసలు సిరిదాన్యలు ఏమిటి అని అడగాల్సిన అవసరం లేదు ఎందుకంటే అందరి నోళ్ళలో అంతగా ప్రచారం అయిపోయాయి అవి. అయితే అసలు ఈ సిరిధాన్యాలలో ఏముంది?? వాటి ప్రయోజనాలు ఏంటి?? ఒకసారి తెలుసుకోండి.
సిరిధాన్యాలు మన భారతీయ ప్రాచీన కాలం నుండి మనకు అందుతున్న ఆరోగ్య వరప్రసాదాలు.
- అరికెలు
- సామలు
- కొర్రలు
- ఊదలు
- అండుకొర్రలు
వీటిని సిరిదాన్యాలుగా పిలుచుకుంటాం. ఇవి గొప్ప ఆరోగ్యాన్ని ప్రసాధిస్తాయి.ఏ ధాన్యంలో ఏముందో ఒక్కసారి చూద్దాం.

అరికెలు:
అరికెలు మన దేశంలో విరివిగా పండుతాయి. వీటిని అన్నంలా వండుకుని తినడమే కాకుండా పిండి కొట్టించి రొట్టెలు, జావ వంటివి కూడా తయారుచేసుకుని వాడతారు.నెమ్మదిగా జీర్ణం కావడం వల్ల ఎక్కువసేపు ఆకలిని దరిచేరనివ్వవు.
అరికెల్లో పిండిపదార్థాలు, పీచు, పుష్కలంగా ఉంటాయి. విటమిన్ బి1,బి2,బి3,బి5,బి6 వంటి విటమిన్లు, కాల్షియం, ఐరన్, పాస్పరస్,వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
రక్తశుద్ది కావటానికి, రక్తహీనతను నిర్మూలించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో, డయబెటిస్ ను క్రమబద్దీకరించడంలో, మలబద్ధకాన్ని తగ్గించడంలో, మంచి నిద్ర పెట్టడానికి అరికెలు చాలా ఉపయోగపడతాయి..

సామలు
సామల దిగుబడిలో భారతదేశం అగ్రస్థానం లో ఉంది. తూర్పు, దక్షిణ భారత ప్రాంతాల్లో సామలు ఇప్పటికి విరివిగా ఉపయోగిస్తున్నారు. అన్నంలా వండుకోవడం తో పాటు, మరపట్టించి పిండితో రొట్టెలు, జావ వంటివి తయారు చేసుకుంటారు. ఇవి తేలికగా జీర్ణమవుతాయి.
సామల్లో పిండిపదార్థాలు, ప్రోటీన్లు, పీచుపదార్థాలు, స్వల్పంగా కొవ్వులు, విటమిన్ బి1,బి2,బి3,బి5,బి6 వంటి విటమిన్లు, కాల్షియం, ఐరన్, పాస్పరస్, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి.
సామలు అండాశయం, పిసిఓడి, సంతానలేమి సమస్యలకు మరియు మగవారి వీర్యకణాల వృధ్ధి చేయడం లో తోడ్పడతాయి.

కొర్రలు
నవధాన్యాలలో ఉపయోగించే వారిలో కొర్రలు ఎక్కువ వినియోగిస్తారు. కొర్ర అన్నం, కొర్ర అంబలి, కొర్ర పిండి రొట్టెలు, ఈమధ్య తరచుగా కొర్రలు ఉపయోగించి స్వీట్లు, చిరు తిండ్లు కూడా తయారు చేస్తున్నారు. ఇంకా వీటిని పాస్తా, నూడిల్స్ వంటి వాటి తయారీలో కూడా ఉపయోగిస్తున్నారు.
కొర్రల్లో పిండిపదార్థాలు, ప్రోటీన్లు, పీచు అధికంగా ఉంటుంది. విటమిన్ బి1, బి2,బి5,బి6 లు పుష్కలంగా ఉంటాయి. సోడియం, పొటాషియం, మెగ్నీషియం, పాస్పరస్,ఐరన్, జింక్, కాపర్, మాంగనీస్ వంటివి కొర్రల్లో లభ్యమవుతాయి.
నరాల బలహీనత తగ్గించి శక్తిని సమకూరుస్తాయి. మానసిక దృఢత్వాన్ని అందిస్తాయి.ఆర్తయిటీస్, పార్కిన్సన్, మూర్ఛ వ్యాధి మొదలుగునవి నివారించడంలో సహాయపడుతుంది.

ఊదలు
ఊదలు తీపిని కలిగి ఉంటాయి. ఇవి మన దేశంలో చాలా రాష్ట్రాల్లో విరివిగా పండుతున్నాయి. వీటిని అన్నంలా, జావ, రొట్టెలు ఇలా రకరకాలుగా వండుకుంటారు.
ఇందులో పిండిపదార్థాలు, పీచు అదికంగా ఉంటుంది. పాస్పరస్, కాల్షియం, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి.
వీటిని లివర్ సమస్యలు ఉన్నవారికి, కిడ్నీ సమస్యలు ఉన్నవారికి, బాలింతల్లో పాలు పెరగడానికి ఉపయోగించడం వల్ల పలితం ఉంటుంది.

అండుకొర్రలు
అండు కొర్రలు మిగిలిన సిరిధాన్యాల్లాంటివే. అయితే వీటిలో పీచుపదార్థం పాళ్లు ఎక్కువగా ఉంటాయి. అన్నం, జావ, రొట్టెలు కాలానుగుణంగా వివిధ రకాలుగా వండుతున్నారు.
అండుకొర్రల్లో నియాసిన్, రిబోప్లోవిన్, కెరోటిన్, ఐరన్, కాల్షియం, పాస్పరస్, ప్రోటీన్, ఖనిజాలు, పిండిపదార్థాలు, పీచుపదార్థాలు ఉంటాయి.
జీర్ణాశయ సమస్యలు, బిపి, థైరాయిడ్, కంటి చూపును వృద్ధిచేయడం, అధికబరువు ను నివారించడం, ఆర్థయిటిస్ వంటి సమస్యలు నివారించడంలో ఉపయోగపడతాయి.
చివరగా……
సిరిధాన్యాలు ఆరోగ్యానికి చాలా మంచిది అయినా వీటిని నేరుగా వండి తినకూడదు. అండు కొర్రలను నాలుగు గంటల పాటు నానబెట్టిన పిదప వండుకోవాలి. అలాగే మిగిలిన నాలుగు రకాలను కనీసం రెండు గంటల పాటు నానబెట్టి వండుకుని తినాలి. గోధుమ రొట్టెల్లో ఉన్న పీచు మనం తిన్న అరగంట లోపు గ్లూకోజ్ గా మారిపోతుంది అందువల్ల అది సాధారణ అన్నం తీసుకున్న గ్లూకోజ్ నే ఇస్తుంది. అయితే సిరిధాన్యాలలో 8 నుండి 12 శాతం పీచు ఉంటుంది అందువల్ల శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు ఎక్కువసేపు ఆకలిని నియంత్రిస్తుంది.