మొలకలు విషయంలో ఎంతో మందికి ఎన్నో సందేహాలు ఉంటాయి. వతాన్నిటికి సమాధానం ఇక్కడే ఉంది. మొలకెత్తిన విత్తనాలను 4, 5 సంవత్సరాలు వచ్చిన పిల్లల దగ్గర్నుండి ముసలి వారి వరకు అందరూ తినవచ్చు. నమలలేని వారు ఈ గింజలను వడల పిండిలాగా కచ్చాపచ్చగా (మరీ మెత్తగా కాకుండా) నూరుకుని చప్పరించి తినవచ్చు. సాదారణంగా పళ్ళు ఉన్నవారు నమిలి తినాలి. సరిగా నమలకపోతే ముక్కలు ముక్కలుగా అరగనట్లుగా జీర్ణయశయం నుండి ఫలితం లేకుండా మలం ద్వారా వచ్చేస్తాయి. అంటే మొలకలు ఆ విధంగా తిన్న ఫలితం శూన్యం. వాటిలో పోషకాలు మనకు అందనట్టే.
మొలకలు ఎప్పుడు తినకూడదు:
మొలకెత్తిన విత్తనాలను సాయంకాలం 6, 7 గంటల ప్రాంతంలో తినకూడదు. చాలా మంది అప్పుడే కొని తింటూ ఉంటారు. అన్నింటికంటే ఉదయం పూట తినడం శ్రేష్ఠం. ఎప్పుడన్నా కుదరకపోతే అప్పుడప్పుడు మధ్యాహ్నం భోజనం లాగా తినవచ్చు. అంతేకాని సాయంత్రం పూట తినడం మంచిది కాదు.
వేరుశనగ మొలకలు చేయాలా??
చాలామందిలో ఉన్న సందేహం ఇది. వేరుశెనగ పప్పులను నానబెడితే సరిపోతుంది. వాటికి మొక్కలు అక్కర్లేదు. పచ్చి కొబ్బరిని యథావిధిగా తినవచ్చు. నాన పెట్టిన వేరుశెనగ పప్పులను, పచ్చి కొబ్బరిని ఎదిగే వయసులో నున్న పిల్లలు, ఎండలో కష్టపడి పనిచేసేవారు, బరువు పెరగవలసిన వారు, కండపట్టాలనుకునే వారు, నీరసం ఎక్కువగా ఉన్నవారు తప్పనిసరిగా తినాలి. షుగరు వ్యాధి ఉన్నవారు పూర్తిగా ఈ రెండింటినీ మొలకెత్తిన విత్తనాలతో పాటు మానుకోవడం మంచిది. బరువు తగ్గవలసిన వారు, కొలెస్ట్రాల్ తగ్గవలసిన వారు వేరుశెనగపప్పులను తినడం మానుకోవాలి. పచ్చి కొబ్బరిని కొద్దిగా తినవచ్చు. బరువు తగ్గాలనే వారు, షుగురున్నవారు మొలకెత్తిన విత్తనాలు 3, 4 రకాలను బాగా తినాలి. అలా తింటే షుగరు, బరువు పెరగవు. వేరు శెనగపప్పులు, కొబ్బరి తినేవారు వాటితో పాటు 2, 3 రకాల మొలకలను తప్పనిసరిగా పెట్టుకుని తింటే మంచిది. మొలకలను ఒక దోసెడు నిండా (అన్నీ కలిపి) ప్రతిరోజూ తినవచ్చు.
గ్యాస్ ట్రబుల్ ఉన్నవారు మొలకలు తినవచ్చా:
గ్యాస్ ట్రబుల్ ఉన్నవారు, బాగా మలబద్దకం ఉన్నవారు, ఆకలి అసలు వేయనివారు మొలకలు 10, 15 రోజులు మాని, పండ్లు తింటే మంచిది. ఆ తరువాత మొలకలు తినవచ్చు. ఈ మొలకలతో ఖర్జూరం పండ్లను చేర్చి తినవచ్చు. బెల్లం వాడటం మంచిది కాదు. ఇక బలహీనంగా ఉన్నవారు, రక్తహీనత ఉన్నవారు ప్రతిరోజు ఖర్జురాలు తినడం ఎంతో మంచిది. షుగరున్న వారు తినకూడదు. ఈ మొలకలు ఉదయం పూట తినటం ఉత్తమం. మరి రోజూ తినే టిఫిన్ సంగతేమిటని అందరి అనుమానము. ఇక వాటితో తీరిపోయింది. ఇంకా ఇడ్లీలు, దోసెలు తింటూ ఉంటే మన ఆరోగ్యం ఇంత కంటే దిగజారి పోతుంది. కాబట్టి వాటిని నెలలో 3, 4 సార్లుగా ఎప్పుడన్నా తినవచ్చు.
చివరగా….
రోజూ మాత్రం మొలకలనే తినడం మంచిది. మొలకలు తినేటప్పుడు వాటితో పాటు ఉడికినవి ఏమీ తినకూడదు. ఇక రోజులో మిగతా టైములో గింజలను తీసుకోకుండా వాటిని ఉదయాన్నే శరీరానికి అందించినట్టు అవుతుంది.