మన భారతీయుల జీవితంలో, సంస్కృతిలో సూర్యనమస్కారాల ప్రాధాన్యత ఎంతో ఉంది. ఉదయం మరియు సాయంత్రం లేలేత సూర్యకిరణాలకు అభిముఖంగా ఆచరించే సూర్యనమస్కారాల వల్ల అంతులేని శక్తి, ఆరోగ్యం సొంతమవుతుంది.అయితే చాలా మంది వీటి గూర్చి పూర్తి ప్రయోజనాలు తెలియక సూర్యనమస్కారాల ప్రక్రియను కొట్టిపారేస్తుంటారు. అలాంటివాళ్ళు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు చూడండి మరి.
చర్మం మరియు కండరాల ఆరోగ్యం మెరుగవుతుంది
సూర్య నమస్కారాలలో అన్ని ఆసనాలు శరీరంలోని వివిధ భాగాలలోని కండరాలు మరియు షట్ చక్రాలు అని పిలువబడే నాడీ కేంద్రాలను చైతన్యం చేస్తాయి. చేతులు, తొడలు సహా శరీర భాగాలన్నింటి కండర వ్యవస్థను పటిష్టం చేయడానికి ఇది సహాయపడుతుంది. దీని ద్వారా శరీరం వివిధ భంగిమలకు సులువుగా బెండ్ అవుతుంది.
మంచి వ్యాయమ ఎంపిక మరియు హార్మోన్ల సమతుల్యతను చేకూరుస్తుంది
శరీరానికి చక్కని వ్యాయామంగా సూర్యనమస్కారాలు దోహాధం చేస్తాయి. మెరుగైన రక్త ప్రసరణ వల్ల కొలెస్ట్రాల్ కరిగిపోయి, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. సరైన రక్త ప్రసరణ జరగడం వల్ల హార్మోన్ల సమతుల్యతగా ఉంచడంలో సహాయపడుతుంది. రక్తం శరీరంలో హార్మోన్లను రవాణా చేసే ముఖ్య వ్యవస్థ కాబట్టి, అది సరిగ్గా పనిచేస్తుంటే, హార్మోన్ల సమస్య తొలగి ఆరోగ్యం చేకూరుతుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది
సమతుల్య ఆహారంతో పాటు సరైన వ్యాయామం మరియు సరైన విశ్రాంతి ఫలితంగా ఇన్సులిన్ సున్నితత్వం మెరుగుపడుతుంది. సూర్య నమస్కారాలు సరైన జీర్ణ రసాలను ఉత్పత్తి చేయడం ద్వారా జీర్ణవ్యవస్థను ప్రేరేపిస్తాయి. అందువల్ల, జీవక్రియను మెరుగుపరుచుకోవచ్చు, ఇది శరీరంలో టాక్సిన్ లను వదిలించుకోవడానికి మరియు అదనపు కేలరీలను ఖర్చు చేయడానికి వ్యాయామం లాగా పనిచేస్తుంది.
శక్తి మరియు అవగాహన స్థాయిని పెంచుతుంది
ఆసనాలతో పాటు, సూర్య నమస్కారంలో శ్వాస విధానం కూడా ఒక ముఖ్యమైన అంశం. ఇది శరీరానికి, మనసుకు లోతైన విశ్రాంతిని ఇస్తుంది. ఇది మనస్సును విశ్రాంతి తీసుకోవడానికి మరియు ఇంద్రియాలకు పదును పెట్టడానికి సహాయపడుతుంది. అలాగే స్వీయ-అవగాహనను పెంచుతుంది, తద్వారా శక్తి స్థాయిలను పెంచుతుంది.
పోషకాలను సమర్థవంతంగా గ్రహించేలా చేస్తుంది.
సరైన రక్త ప్రసరణ మరియు జీర్ణక్రియ పోషకాలను బాగా గ్రహించటానికి వీలు కల్పిస్తుంది, ఇది మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పోషకాలు గ్రహించడం ద్వారా శరీరంలో కీలకమైన విధులను నిర్వహించడానికి సహాయపడుతుంది. నేటి ప్రపంచంలో, అనారోగ్యకరమైన జీవనశైలి థైరాయిడ్ పనిచేయకపోవడం, పిసిఒడి, పిసిఒఎస్, ఉబకాయం వంటి అనేక రుగ్మతలకు కారణం శరీరం విధులు సక్రమంగా లేకపోవడమే. సూర్య నమస్కారాలు దినచర్యలో భాగంగా చేసుకోవడం వల్ల పైన పేర్కొన్న వ్యాధులను సులువుగా అధిగమించవచ్చు.
భావోద్వేగాలు అదుపులో ఉంచుతుంది
ఇందులో ఆసనాలు లోతైన శ్వాస పద్ధతులు నాడీ కణాలు లేదా షట్ చక్రాలకు గొప్ప విశ్రాంతిని ఇస్తాయి. ఇది మెదడు పనితీరును సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. ప్రత్యేకంగా, ఇది మెదడు యొక్క కుడి మరియు ఎడమ వైపుల మధ్య సమతుల్యతకు దోహాధం చేస్తుంది. దీనివల్ల ఆందోళన, మానసిక భావోద్వేగాలు తగ్గి వాటన్నిటిని అదుపులో ఉంచి మానసిక సామర్థ్యాన్ని పెంచుతుంది.
చర్మానికి రంగును, కాంతిని ఇస్తుంది
మంచి రక్త ప్రసరణ, మంచి జీర్ణక్రియ, విశ్రాంతి మరియు మంచి నిద్ర ఫలితంగా చర్మం ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా తయారవుతుంది.
చివరగా……
పైన చెప్పుకున్న ప్రయోజనాలు అన్ని ప్రతిరోజు సూర్య నమస్కారాలను పాటించడం ద్వారా తప్పకుండా పొందవచ్చు.