ప్రకృతిలో సహజంగా లభించే చాలా మొక్కలు ఔషధగుణాలు కలిగిఉంటాయి. అందులో ఆధ్యాత్మిక ప్రాముఖ్యంతో పాటు ఔషధగుణాలు కూడా కలిగినవి తులసిమొక్కలు. తులసిలో చాలా రకాలు ఉన్నాయి. అందులో రామతులసి, కృష్ణ తులసి ఎక్కువగా ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. ప్రకృతి వైద్యంలో కూడా తులసిని విరివిగా ఉపయోగిస్తుంటారు. వంటింటి చిట్కాలుగా కూడా తులసిని ఉపయోగిస్తుంటాం. పూజావిధానంలోనూ, వైద్యంలోనూ వాడే తులసి ఔషధగుణాల గురించి తెలుసుకుందాం రండి. తులసి నోటిపూత, నోటి అల్సర్లు, జలుబు, దగ్గు, డయేరియా, జ్వరం అన్నిటినుండి ఉపశమనం కలుగజేస్తుంది. తులసిని నీటిలో మరిగించి తాగితే తలనొప్పి వెంటనే తగ్గుతుంది. మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి, జ్ఞాపకశక్తి పెరుగుదలకు తులసి బాగా పనిచేస్తుంది. దీనికోసం రోజుకు రెండు తులసి ఆకులను తినాలి. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.
వర్షాకాలంలో వచ్చే వైరల్ ఫ్లూలాంటి జ్వరాలకు తులసి డికాక్షన్ సత్వర ఉపశమనం ఇస్తుంది. అదే జ్వరం ఎక్కువగా ఉన్నప్పుడు తులసి టీని పాలు, యాలకులతో కలిపి మరిగించి తాగడం వలన జ్వరం తీవ్రత తగ్గుతుంది. బ్రాంకైటీస్, కఫాన్ని తగ్గించడంలో తులసి మంచి ఔషధం. క్రమం తప్పకుండా తులసి ఆకులను నమిలి రసం మింగడం వలన కఫం కరిగిపోతుంది. ఐదారు తులసాకులతో మిరియాలు దంచి ఆ రసం తీసుకోవడం వలన వాంతులు, వికారం తగ్గుతుంది. పిల్లల్లో ఎక్కువగా కనిపించే నులిపురుగులు సమస్య కూడా తగ్గుతుంది. కీటకాలతో బాధపడుతున్నపుడు ఎండిన తులసిఆకులు ఇంట్లో పెట్టడంవలన వాటి బెడద తగ్గుతుంది. తులసి ఆకులను రసంలేదా తులసి పొడి హెర్బల్ టీ లేదా నేతిలో మరిగించి తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
మధుమేహంతో బాధపడేవారికి తులసి రోజుకు ఐదారు ఆకులు తినడం వలన చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అనేక మూత్ర సంబంధ వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి. ఒక స్పూన్ తులసి పొడిని తీసుకుని అందులో పావుస్ఫూన్ పసుపు పొడి, అరస్పూన్ ఉప్పు, ఒక చెంచా ఆవనూనె వేసీ ఈ మిశ్రమంతో పళ్ళు తోముతూ ఉంటే పళ్ళపై ఉండే గార, పిప్పళ్ళు, చిగుళ్ల సమస్యలు, పళ్ళనొప్పి తగ్గించడంతో పాటు పళ్ళను తెల్లగా మెరిసేలా చేస్తుంది. రక్తంతో కూడిన దగ్గు కూడా తులసిని తినడం వలన తగ్గుతుంది. జీర్ణశక్తిని పెంచడానికి కూడా తులసి ఉపయోగపడుతుంది. ప్రేగులలో ఇన్ఫెక్షన్లు, క్రిములను తగ్గిస్తుంది. తులసి, మిరియాల పొడిని కలిపి తీసుకోవడం వలన మలబద్దకం, ఎసిడిటీని తగ్గిస్తుంది. ఉబ్బసం, పిల్లల్లో ఆకలి లేకపోవడం, గొంతునొప్పి, గొంతు బొంగురు పోయినపుడు తులసి డికాక్షన్ మంచి ఔషధం. మన ఇంటిముందే పెరిగే తులసిలో ఎన్ని ఔషధగుణాలు ఉన్నాయో తెలిసిందిగా. ఇక ఎందుకు ఆలస్యం ఆరోగ్యానికి ఇంతమేలు చేసే తులసిని చాలాకాలం నుండి మీరు బాధపడుతున్న సమస్యలకు మందుగా ఉపయోగించి ఆరోగ్యాన్ని పొందుదాం.
Good information tq
చాలా ఉపయుక్తమైన సమాచారమిచ్చినందుకు ధన్యవాదాలు.