మనకొచ్చే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు, డాక్టర్లు, ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు, లేకుండా పని జరగడం లేదు. కానీ కాస్త అవగాహన, మరికాస్త ఓపిక ఉంటే సులువుగా ఇంట్లోనే పరిష్కరించుకోవచ్చు. అలాంటి కొన్ని చిట్కాలు మీకోసం.
◆అసలు నిద్ర పట్టక నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ఒక స్పూన్ గసగసాలు తీసుకుని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో కలిపి తాగితే నిద్రలేమి సమస్య దూరమవుతుంది. హాయిగా నిద్ర పడుతుంది.
◆చిన్న పిల్లలకు జలుబు బాగా వేధించే సమస్య. ఊపిరి పీల్చుకోలేక చాలా ఇబ్బంది పడతారు. అలాంటి జలుబు నుంచి తక్షణ పరిష్కారం లభించాలంటే రెండు తాజా తమలపాకులు తీసుకుని బాగా నలిపితే రసం వస్తుంది. అందులో కొంచెం తేనె కలిపి జలుబు చేసిన పిల్లల చేత నాకిస్తూ ఉంటే ఉపశమనం వెంటనే లభిస్తుంది.
◆కొంతమందికి తుమ్ములు అలా ఆగకుండా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఇలా తుమ్ములు రావడం వల్ల చాలా చిరాగ్గా అనిపిస్తుంది. తాజా కొత్తిమీరను తీసుకుని బాగా నలిపి వాసన చూస్తూ ఉంటే తుమ్ములు వెంటనే ఆగిపోతాయి. ఎక్కువగా తుమ్ములు వచ్చే వారికి ఈ చిట్కా ఒక చక్కని పరిష్కారం.
◆శరీరంలో వాత పరమైన నొప్పులు ఉంటే దాల్చిన చెక్క మెత్తని పౌడర్ చేసి రోజు వేడి పాలలో ఒక స్పూన్ కలిపి తాగితే వాతపు నొప్పులు బాధించవు. తగ్గుముఖం పడతాయి.
◆కొద్దిమందికి ఏదైనా దెబ్బ తగిలితే తొందరగా మానదు పుండు పడి శరీరంలో ఆ ప్రదేశం చాలా బాధకు గురి అవుతుంది. అలాంటి పుండ్లు వెంటనే తగ్గుముఖం పట్టాలంటే, సీతాఫలచెట్టు ఆకులు తీసుకుని మెత్తని పేస్ట్ లా చేసి ఆ పుండు మీద రాస్తూ ఉంటే మూడు రోజుల్లోనే పుండు మాడు కట్టేస్తుంది. నొప్పిని కూడా తగ్గిస్తుంది.
◆ఇంగువ, హారతి కర్పూరం సమాన భాగాలుగా తీసుకుని కంది గింజంత ఉండలు చేసుకుని ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే ఆయాసం, ఉబ్బసం, సైనస్, గుండె దడ, శ్వాస సంబంధితమైన ఇబ్బందులు అదుపులో ఉంటాయి.
◆నోటి పూత ఎక్కువగా బాధిస్తూ ఉంటే కరక్కాయను అరగదీసి ఆ గంధాన్ని నాలికకి రాసి కాసేపు ఉంచుకుంటే నోటి పూత నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా చేయడం ఇబ్బందిగా అనిపిస్తే కరక్కాయ పౌడర్ చేసి వేడినీళ్లలో అర స్పూన్ కరక్కాయ పొడి వేసి తాగినా నోటి పూత సమస్య కి మంచి ఫలితం ఉంటుంది.
◆ఒళ్ళు నొప్పులు కండరాల నొప్పులు అధికంగా ఉన్నవాళ్లు వేరుశనగ నూనెను గోరువెచ్చగా వేడిచేసి ఒంటికి మసాజ్ చేసుకుంటే నొప్పులు తగ్గుతాయి.
◆వేసవి కాలంలో వేధించే మరో సమస్య సెగ్గడ్డలు ఒంట్లో వేడి అధికంగా చేరడం వల్ల ఏర్పడుతూ ఉంటాయి. కొంచెం బియ్యం పిండి నీళ్లల్లో కలిపి
బాగా ఉడికించి కొద్దిగా వేడిగా ఉండగానే సెగ్గడ్డ ఉన్నచోట ఆ పిండిని ముద్దగా వేసి కట్టుకడితే సెగ్గడ్డలు పగిలిపోతాయి. ఆ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
◆కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి శరీరానికి రాయడం వల్ల శరీరంపై వచ్చే దురద దద్దుర్లు చెమట కాయలు మంట అన్నీ తగ్గుతాయి. రాయగానే కొంచెం మంటగా అనిపించినా తర్వాత చల్లగా అనిపిస్తుంది..
చివరిగా….
ఇలా చెప్పుకుంటూ పోతే రాసుకోవడానికి పేజీలు సరిపోని అన్ని చిట్కాలు ఉన్నాయి. ఇవన్నీ మనకి తక్కువ ఖర్చు లో ప్రయోజనాలు కలిగించేవే, ఆయుర్వేద వైద్య నిపుణులు కూడా ఇవి పాటించమని, ఇలాంటి చిట్కాల వల్ల ఎలాంటి ఆరోగ్య హాని లేదని చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రతి చిన్న విషయానికి ఆ హాస్పిటల్ కి పరిగెత్తకుండా చిన్నచిన్న చిట్కాలతో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం ఎంతో ఉత్తమం.