టాన్సిల్స్ ప్రతి ఒక్కరికి గొంతు భాగంలో ఇరువైపులా చిన్న కండల్లా ఉంటాయి. ఇవి మనం తీసుకునే ఆహారంలో దుమ్ము ధూళి,సూక్ష్మ క్రీములు, బాక్టీరియా, వంటి హానికరమైనవి కడుపులోకి వెళ్లకుండా గొంతులోనే అడ్డుకుంటాయి. అయితే కలుషితమైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ కు గురయ్యి చాలా ఇబ్బంది పెట్టేస్తాయి. ముఖ్యంగా పెద్దలకంటే పిల్లల్లోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కారణం పిల్లలు చిరుతిల్లు, మరియు బయట స్కూల్స్ వద్ద స్కూల్స్ నుండి వచ్చేదారిలో ఏదైనా పదార్థం కనబడితే కొనేసి తింటూ ఉంటారు. ఈ టాన్సిల్స్ గొంతుకు ఇరువైపులా ఎర్రగా వాపును కలుగజేసి ఆ నొప్పిని క్రమంగా చెవికి మరియు అక్కడి నుండి మెదడుకు కూడా విస్తరించే అవకాశం ఉంటుంది. కాబట్టి టాన్సిల్స్ వస్తే అశ్రద్ధ చేయడం వలదు. అయితే చాలా మంది టాన్సిల్స్ కు ఆపరేషన్ మాత్రమే మార్గం అనుకుంటారు. చిన్న చిన్న చిట్కాలతోనే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అవేంటో ఒకసారి చూద్దామా….
చిట్కాలు- జాగ్రత్తలు
◆టాన్సిల్స్ ఉన్నపుడు ఎక్కువగా నమిలే శ్రమ ఉన్న ఆహారానికి దూరంగా ఉండాలి. అలాగే మృదువైన మెత్తని పదార్థాలు తీసుకోవాలి. దీన్ని ఫాలో అయితే టాన్సిల్స్ ను నివారించుకోవడంలో సగం విజయం సాదించినట్టే.
◆నొప్పిని ఇంకా పెంచే పులులు, ఉప్పు, కారం, మసాలా తో కూడిన పదార్థాలు తీసుకోకూడదు.
◆మెత్తగా వండిన అన్నం తీసుకోవడం వల్ల కడుపు కాల్చుకునే పని లేకుండా సమస్యను మెల్లిగా తగ్గించుకోవచ్చు.
◆వీలైతే గోరువెచ్చగా సూప్ లు తయారుచేసుకుని తాగడం వల్ల టాన్సిల్స్ తగ్గడానికి తోడ్పడటమే కాకుండా ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. ఈ సూప్ లిస్ట్ లో కొత్తిమీర, పుదీనా, పాలకూర సూప్ లు అయితే ఇంకా ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తాయి.
◆మెత్తగా ఉడికించిన బందళాదుంప తీసుకోవడం కూడా చక్కని మార్గం.దీన్ని అన్నంతో మృదువుగా కలిపి తీసుకోవచ్చు. ఇంకా కారం ఎక్కువ వేయని టమాటా చారు లాంటివి అన్నంలో బాగా కలిపేసి మెల్లిగా తాగేయచ్చు కూడా.
◆స్పూన్ అల్లం రసంలో రెండు స్పూన్ల తేనె కలిపి తీసుకోవడం వల్ల టాన్సిల్స్ వాపు తగ్గించి తొందరగా తగ్గడంతో సహాయపడుతుంది. అల్లం మంచి యాంటీ బాక్టీరియల్ గా పనిచేస్తుందనే విషయం అందరికి తెల్సినదే.
◆తేనెలో మిరియాల పొడి కొద్దిగా కలిపి తీసుకోవడం వల్ల టాన్సిల్స్ చాలా తొందరగా తగ్గుతాయి.
◆ఒక గ్లాస్ లో గోరువెచ్చని నీటిలో నిమ్మరసం మరియు, అల్లం రసం కలిపి తీసుకోవడం వల్ల వాపు నెమ్మదించి తగ్గిపోతుంది. అలాగే తేనె నిమ్మరసం కూడా ఉపయోగించవచ్చు.
◆టాన్సిల్స్ ఉన్నపుడు మెత్తని పదార్థాలు ఆహారంగా తీసుకోవాలి. ఇడ్లి, దోస, ఎగ్ ఆమ్లెట్, మెత్తగా వండిన అన్నం, ఇంకా పెరుగు అన్నం తీసుకోవచ్చు అయితే పెరుగును చల్లగా ఉన్నపుడు తినకూడదు.
◆పెద్దలు చెప్పే చక్కని చిట్కా చింతకాయ పచ్చడి. పాత చింతకాయ పచ్చడిని మెత్తగా వండిన అన్నంలో వేసుకుని కొద్దిగా నెయ్యి కలిపి తినడం వల్ల టాన్సిల్స్ తొందరగా బలాదూర్ అవుతాయి.
◆కూల్ డ్రింకులు, ఐస్ క్రీములు, చల్లని నీళ్లు, ఫ్రిజ్ లో నుండి అపుడే బయటకు తీసిన చల్లని పదార్థాలు మొదలైనవాటికి దూరంగా ఉండాలి.
చివరగా
పైన చెప్పుకున్న జాగ్రత్తలు, చిట్కాలు పాటిస్తూ ఉంటే టాన్సిల్స్ సమస్య చిటికెలో మాయం.