మన రోజువారీ జీవితంలో వంటల్లో తప్పనిసరిగా వాడేది పసుపు. పసుపులేని వంట దాదాపు ఎక్కడా కనిపించదనే చెప్పవచ్చు.. మన భారతీయుల జీవన విధానంలో పసుపునకు అధిక ప్రాధాన్యం ఉంది.
పసుపు చరిత్ర ఏంటి???
కొన్ని దశాబ్దాల క్రితం పశ్చిమ ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు దక్షిణ ఆసియా దేశాల్లో మొదట పసుపు ను కనుగొన్నారు. ఇందులో మనదేశం ప్రముఖమైనది. దీంతో పసుపులోని ఔషధ గుణాలు, దీని ప్రాముఖ్యం ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయాయి. ఇక హిందూసంప్రదాయంలో దీనికున్న ప్రాముఖ్యం గూర్చి చెప్పాల్సిన అవసరమే లేదు. పండుగల సమయంలో, శుభకార్యాలప్పుడు ఎక్కువగా వినియోగిస్తారు. పసుపు పవిత్రతకు చిహ్నం.. ఆయుర్వేద వైద్య శాస్త్రంలో అయితే పసుపు అద్భుత ఔషధం. పసుపు సహజ సిద్దమైన ఆంటి బయాటిక్. పసుపును సంస్కృతంలో హరిద్రా అంటారు. ఔషధంగానూ, నిత్యజీవితంలో ప్రతిరోజు ఉపయోగిస్తున్న ఈ పసుపుతో ఒక అద్భుతమైన కానుక మీకోసం.

పసుపు టీ……
పసుపుతో టీ ఏంటి అని ఆలోచన వద్దు. ఇప్పటికే చాలామంది పాలల్లో చిటికెడు పసుపు వేసుకుని తాగుతూ ఆరోగ్యం వైపు నడుస్తున్నారు. అలాంటి మరొక బంగారు కానుకనే పసుపు టీ…..
తయారువిధానం.
పెద్ద కష్టపడక్కర్లేకుండానే పసుపుతో టీ ను తయారు చేసుకోవచ్చు. మనకు కావాల్సిందల్లా ఒక చిన్న పసుపు కొమ్ము, కాసింత తేనె, చిటికెడు మిరియాల పొడి. ఒక కప్పు నీళ్లు.
ఒక గిన్నెలో నీళ్లు వేసి మరిగించాలి. నీళ్లు మరుగుతుండగా పసుపు కొమ్మును కాసింత దంచి నీళ్లలో కలపాలి. ఆ మిశ్రమాన్ని దాదాపు రెండు నిమిషాల పాటు మరిగించి దించి వడగట్టాలి.
ఇలా వడగట్టిన ద్రవంలోకి చిటికెడు మిరియాల పొడి, స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే పసుపు టీ మన ముందు రెడి అయినట్టే. ప్రతిరోజు ఉదయాన్నే పసుపు టీ తీసుకోవడం వల్ల ఎన్నోరకాల జబ్బులను సులువుగా నయం చేసుకోవచ్చు. ఇంతకు పసుపు టీ వల్ల ఉపయోగాలు ఏంటో కొన్ని చూద్దాం.
పసుపు టీ ఉపయోగాలు.
◆పసుపులో ఉండే యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు ఆమ్లజనకాలు క్యాన్సర్ ని తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. అందువల్ల రెగ్యులర్ గా పసుపు టీని తాగుతూ ఉండటం వల్ల క్యాన్సర్ మన దరి చేరకుండా కాపాడుతుంది.
◆వయస్సు పెరిగే కొద్దీ ఎదురయ్యే సమస్య అల్జీమర్స్ వ్యాధి. మెదడు పని చేసే సామర్థ్యం తగ్గి ఈ వ్యాధి వస్తుంది.అయితే పసుపులో ఉండే ఆమ్లజనకాలు మెదడు కణాల క్షీణతను తగ్గించడానికి పని చేస్తాయి. అలాగే మెదడులోని కణాలు ఉత్తేజంగా పని చేయడానికి పసుపు టీ బాగా పని చేస్తుంది. ప్రతిరోజు పసుపు టీ తాగడం వల్ల ఈ మతిమరుపు అనే సమస్యను మన దరిదాపుల్లో రాకుండా చేసుకోవచ్చు.
◆ పసుపు ఆంటి బయాటిక్ అయితే పసుపు టీ లోకి ఉపయోగించే తేనె, మిరియాలు కూడా స్వతహాగా గొప్ప ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. అందుకే పసుపు టీ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
◆మన శరీరంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచే గొప్ప గుణం పసుపులో ఉంది. అందుకే మధుమేహం ఉన్న వారు పసుపు టీ ని రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
ఇంకా…….
పసుపు టీ తాగడం వల్ల మన ఊపిరితిత్తుల పరితీరు మెరుగుపడుతుంది. అలాగే బరువు తగ్గాలని అనుకునేవారికి పసుపు టీ చక్కని పరిష్కారం. ఇంకా పసుపు టీ మన శరీరం లో కొవ్వులను క్రమబద్దీకరిస్తుంది. ఇలా ఎన్నో అద్భుతమైన పరిష్కారాలను అందించే పసుపు టీ రోజూ తాగి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మనచేతుల్లోనే ఉంది.