వాతం శరీరంలోని త్రిగుణాలలో ఒకటి. మన శరీరానికి జీవశక్తులను ధారపోసే ఈ త్రిగుణాలు సమతా స్థితిలో ఉంటే మన ఆరోగ్యం కూడా సంపూర్ణంగా ఉంటుంది. ఈ మూడు గుణాలతో ఏదో ఒక గుణం హెచ్చుతగ్గులు అవుతూ ఉంటే మన శరీరంలో జబ్బులు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. ఈ మూడు గుణాలలో ప్రధానమైన వాతం ఎక్కువైతే ఒళ్ళంతా నొప్పులతో విలవిల్లాడిపోతాము. అయితే ఈ వాతాన్ని ఆమడదూరం తరిమెసే కొన్ని జాగ్రత్తలు మరియు చిట్కాలు చూస్తే ఓస్ ఒంత సులువుగా వాతాన్ని తరిమెయొచ్చా అని మీరే ఆశ్చర్యపోతారు. మరి అవేంటో ఇపుడు చూద్దాం.
◆ వాతం సమస్య ఉన్నవారు ఆరునెలల నాటి పాత బియ్యాన్ని వాడుకోవాలి. దీనివల్ల వాతం ఉత్పత్తి తగ్గుతుంది. అదే కొత్త బియ్యం వల్ల తగ్గిపోయిన నొప్పులు మళ్ళీ పునరావృత్తం అవుతాయి.
◆ కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పులను వంటల్లో నిరభ్యరంతంగా వాడుకోవచ్చు. ఇవి ఎలాంటి వాత సమస్యలను సృష్టించవు.
◆ పులిసిన మజ్జిగ, పుల్లటి పళ్ళు, పులుపు కలిగిన ఏ ఇతర పదార్థాలు అయినా సరే వాటికి దూరంగా ఉండాలి. కొత్త చింతపండు కూడా వాడకపోవడం ఉత్తమం. ఇలా చేస్తే వాతం పెరగదు.
◆ ఆవు నెయ్యి ఆవు మజ్జిగ వాతం ఎక్కువగా ఉన్నవారికి అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే పాలు, పెరుగు వాడటం మానివేసి మజ్జిగను వాడటం మంచిది.
◆ గోంగూర, బచ్చలి కూర, చుక్కకూర, పచ్చి టమాటా, పండిన దొండకాయ వంటి వాటి జోలికి సాధ్యమైనంతవరకు వెళ్లకుండా ఉండటం ఉత్తమం. వీటిలో పులుపు శాతం హెచ్చుగా ఉంటుంది.
◆ ఒంట్లో వాతం ఉన్నవారు కంద, చిలకడదుంప, బంగాళదుంప వంటి దుంపకూరల జోలికి వెళ్లకుండా ఉండటం వల్ల వాతాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.
◆ మాంసాహరులలో వాతానికి సంబందించిన సమస్యలు ఎక్కువగా కనబడుతుంటాయి. కారణం మాంసం వాతాన్ని వృద్ధి చేదే లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి మాంసాహారులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
◆ జున్ను, ఆవాలు, ఆవపిండితో చెందిన పదార్థాలకు మరియు ఎర్ర గుమ్మడికాయ, ముదిరిన వంకాయలు( వీటిలో గింజలు చాలా బలిసిపోయి లావుగా ఉంటాయి), ముదిరిన ములక్కాయలు వాతాన్ని కలిగిస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.
◆ లేత ముల్లంగి, లేత క్యారెట్, క్యాలీఫ్లవర్, వెల్లుల్లి, ఉల్లి, ధనియాలు, అల్లం, శొంఠి, వాము, జీలకర్రలను నిస్సందేహంగా వాడుకోవచ్చు.
◆ బీర, పొట్ల, సొర, దోస, పాలకూర, తోటకూర, పొన్నగంటి కూర, చక్రవర్తి ఆకు, బూడిద గుమ్మడికాయలు తరచూ తినవచ్చు వీటివల్ల ఎలాంటి సమస్య ఉండదు.
◆ నూనె ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను తినకపోవడమే మంచిది. ఊరగాయలు, పిండి వంటలు, పూరీలు, అట్లు, నూనె పదార్థాలు కాబట్టి వీటికి దూరంగా ఉండటం ఉత్తమం. తినాలని అనిపించినపుడు నూనెకు బదులుగా నెయ్యి వాడుకుంటూ ఉండవచ్చు.
◆ శనగపిండితో చేసే వంటకాలు ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం. వాతాన్ని పెంచే ప్రథమ పదార్థం ఇదే.
◆ హారతి కర్పూరాన్ని వేడి వేడి నువ్వుల నూనెలో వేసి కరిగించి చల్లార్చిన తరువాత వాత నొప్పిగా ఉన్న ప్రాంతంలో మర్దనా చేస్తుంటే నొప్పుల నుండి ఉపశమనం ఉంటుంది.
◆ రోజు ఒకటి, రెండు వెల్లుల్లి పాయలు తీసుకుంటూ ఉంటే వాతం దూరంగా ఉంటుంది.
◆ వేప పూతను ఎండబెట్టి, నేతిలో వేయించి మెత్తగా దంచుకుని తగినంత ఉప్పు, కారం కలిపి నిల్వచేసుకోవాలి. దీన్ని రోజు కొద్దిగా అన్నంలో కలుపుకుని తింటూ ఉంటే వాతానికి గొప్పగా పనిచేస్తుంది.
◆ శొంఠి అందులో సగభాగం వెల్లుల్లి తీసుకుని విడివిడిగా నేతిలో వేయించి మెత్తగా దంచి రోజూ అన్నంలో కలువుకుని తినాలి. దీనికి ఒక చెంచా నెయ్యిని జోడించుకోవచ్చు. ఇది వాతపు నొప్పులకు చాలా మేలు చేస్తుంది.
చివరగా…..
వాతం అనేది ఆహారంలో జరిగే మార్పుల వల్ల సంభవిస్తుంది కాబట్టి ఆహారం తీసుకునే విషయంలో తగినంత జాగ్రత్తలు తీసుకుంటూ పైన చెపుకున్నవాటిని పాటిస్తే సమస్యకు చెక్ పెట్టవచ్చు.