కోత్తవాళ్లను కలిసినప్పుడు వాళ్ళతో భోజనం చేస్తున్నపుడు లేక బయటకు వెళ్ళినపుడు ఇలా చాలా సందర్భాలలో వింటూ ఉంటాం. నాకు అది పడదు అందుకే తినను, నాకు అది ఒంటదు అందుకే దూరంగా ఉంటాను అని. అసలు ఈ పడకపోవడం అంటే ఏమిటి అని ఆరా తీస్తే ఇప్పటికి ఇంగ్లీష్ భాషలో అలర్జీ అనేస్తారు. మన శరీర తత్వానికి సరిపడని ఆహారం తిన్నా, మనకు సరిపడని పదార్థాలు ముట్టినా, వాసన పీల్చినా ఇలా ఎన్నో రకాలుగా ఈ అలర్జీ అటాక్ చేస్తుంది.
అసలు అలర్జీ ఎందుకు వస్తుంది అంటే మన శరీర తత్వానికి సరిపడనివి మనం తీసుకున్నప్పుడు మన శరీరంలో యాంటీ బాక్టీరియల్ కణాలు ఆ పడని పదార్థాలలో ఉన్న టాక్సిన్లతో పోరాడతాయి. ఫలితంగా మన శరీరం మీద దద్దుర్లు రావడం, చర్మము ఎర్రబడటం, మండినట్టు అనిపించడం అవుతుంది. ఇది మొదటిసారి కాసింత ప్రభావం తక్కువగా కనిపించినప్పటికి మాటిమాటికి ఆ అలెర్జీకి మన శరీరం లోనైతే దాని ప్రభావం పెరిగి మన శరీరంలో రోగనిరోధకశక్తి క్షీణించి ప్రమాదకరంగా మారి అది ప్రాణాపాయ స్థితిలోకి కూడా తీసుకెళ్తుంది.
అలర్జీ కలిగించే పదార్థాలు
వైద్యులను సంప్రదిస్తున్న వారిని సర్వే చేస్తే ఎక్కువ అలర్జీ ని కలిగిస్తున్న పదార్థాలు ఏమిటో తెల్సింది మీకోసం అవన్నీ.
◆ఆహార పదార్థాలలో గుడ్డు, పాలు, గోధుమలు, ఆకుకూరలు, వేరుశనగ, పచ్చిమిర్చి మొదలైనవి కొందరి శరీర తత్వానికి ఒంటవు.
◆తరచుగా నొప్పులు, దగ్గు, జలుబు తగ్గించుకోవడానికి వాడే పెయిన్ కిల్లర్స్ అలర్జీ ని కలిగించడంలో ప్రథమ స్థానంలో ఉంటాయి. ఎవరికి వారు మెడికల్ స్టోర్ లో పెయిన్ కిల్లర్స్ తెచ్చుకుని వేసుకోవడం వల్ల అవి రోగనిరోధక వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేసి శరీరం మీద దద్దుర్లు, శ్వాశ లో ఇబ్బందులు, తలనొప్పి, కడుపు నొప్పి, విరేచనాలు, తలతిరగడం, వాంతులు వంటి సమస్యలు రావడం జరుగుతుంది.
◆ముఖ్యంగా అలర్జీలకు ఆడవాళ్లు ఎక్కువగా గురవుతుంటారు. కారణం బ్యూటీ ఉత్పాదకాలైన, బాడి లోషన్ లు, ఫేస్ క్రీములు, స్ప్రే లు, ఫేస్ పాక్ లు మొదలైనవి ఉపయోగించడం వల్ల.
◆ఇక తరువాత కనిపించే పెద్ద కారణం ఇంటిని శుభ్రపరచడానికి ఉపయోగించే లిక్విడ్ లు, బాత్రూం క్లీన్ చేయడానికి ఉపయోగించే యాసిడ్, ఫెనాయిల్ వంటి రసాయన కారకాలు, ఘాటైన వాసన కలిగిన బ్లీచింగ్ పౌడర్ వంటివి, మొక్కలకు ఉపయోగించే ఎరువుల వాసన వంటివి అలర్జీని కలిగించే వరుసలో ఉంటాయి.
◆చాలామంది ఇల్లు ఆహ్లాదంగా ఉండాలని ఉపయోగించే ఎయిర్ ఫ్రెషర్లు, మస్కిటో రిఫిల్స్ వంటివి కూడా ఇంట్లో పిల్లలకు తొందరగా అలర్జీని కలుగచేస్తాయి. అలాగే పిల్లలకు ఉపయోగించే పౌడర్లు, డైపర్లు కూడా అలర్జీని కలిగిస్తాయ్. వాటిని గమనించకుండా పిల్లలు ఏడుస్తున్నా వాళ్ళింతే అనుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.
చివరగా….
అలర్జీకి శాశ్వత పరిష్కరమంటూ లేదు, శరీరానికి వ్యతిరేకంగా పనిచేసే వాటిని దూరంగా ఉంచడం మాత్రమే ఉత్తమ మార్గం. చాలా మంది తమ ప్రొడక్ట్ లు వాడే ముందు ప్యాచ్ టెస్ట్ లు చేసుకోమని చెబుతుంటారు. వారు అందులో వాడిన రసాయనాల వల్ల అలర్జీలు వస్తాయనే కారణంతో చేసే ముందు హెచ్చరిక అది. కాబట్టి పడని వాటిని దూరంగా ఉంచితే పోయేదేం లేదుగా, మన ఆరోగ్యం మన చేతుల్లోనే మరి.