What are three Doshas of Ayurveda

మూడు గుణాల మర్మం కాపాడుకోవడమే మన ధర్మం

మనశరీరానికి ఏదైనా జబ్బు చేసింది అంటే దానికి కారణం మనం శరీరంలో అసమతుల్యత సంభవించిందని. అసలు ఈ అసమతుల్యత ఎందుకు సంభవిస్తుంది అంటే మనం తీసుకునే ఆహారం వల్ల మరియు మన రోజువారీ కృత్యాలు కూడా కాస్త మందగించడం లేదా అస్తవ్యస్తం వల్ల. ఆయుర్వేద శాస్త్రం లో మన శరీరం ఇలా అస్తవ్యస్తం కావడానికి కారణాలుగా చెబుతూ వాత, పిత్త, కఫ అనే గుణాలను పేర్కొంటారు.అసలు ఈ వాత, పిత్త, కఫలు ఏమిటి అని మనం తరచి చూస్తే వాటి గూర్చి కింద పేర్కొనబడ్డట్టు తెలుస్తుంది.

వాత, పిత్త, కఫ దోషాలు.

మన శరీరం త్రిగుణాల కలయిక ఆ మూడు గుణాలనే వాత, పిత్త కఫలు అంటున్నారు. ఈ మూడు గుణాలు మన శరీరంలో ఒక్కొక్కటి ఒక్కో  కర్తవ్యాన్ని నెరవేరుస్తాయి.  అవేంటో చూద్దాం.

వాత గుణం.

ప్రతిమనిషి  శరీర నిర్మాణంలో వాత గుణం ప్రధానమైనది. ఇది శరీరంలో జీవకణజాలన్ని  నిర్మించుకుంటూ వెళ్తుంది. వాతం ప్రకోపిస్తే(పెరిగితే) మన శరీర కణజాలం పై ఒత్తిడి పెరుగుతుంది. దాని పర్యావసానమే మనం నిత్యం వినే  వాతనొప్పులు. ఈ వాత గుణం సక్రమంగా ఉంటే మన శరీరంలో కండరాల నిర్మాణం చక్కగా ఉంటుంది. దీని ద్వారా శ్వాశ నియంత్రణలో ఉంటుంది. శ్వాశ అనేది సరిగా ఉందంటే హృదయ స్పందన ఆరోగ్యకరంగా ఉందని అర్థం. కాబట్టి వాతం అనేది మన శరీరంలో ఎంత మోతాదులో ఉండాలో అంతలో ఉండాలి.

పిత్త గుణం.

మనం తీసుకునే ఆహారపదార్థమే మన జీవిత కాలాన్ని పొడిగించేది. అటువంటి ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడేది పిత్త గుణం. ఇది  మనం తీసుకునే ఆహారం నుండి శరీరానికి అవసరమైన విటమిన్స్ ను ప్రోటీన్స్ ను తీసుకుని శారీరక పుష్టిని కలుగజేస్తుంది.అలాగే మన శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరిస్తుంది. ఇది శరీరానికి కలిగించే వేడి వల్ల ఆకలి, దాహం కలుగుతాయి. పిత్త గుణం ఎపుడైతే అస్తవ్యస్తం అవుతుందో మన జీర్ణ వ్యవస్థ కూడా అసమతుల్యతలో పడిపోతుంది. అందుకే పిత్త గుణం సక్రమంగా లేకపోతే ఆహార వ్యవస్థ దెబ్బ తిని తొందరగా జబ్బులు సంక్రమిస్తాయి.

కఫ గుణం.

కఫ గుణం వల్ల మన శరీరంలో కాల్షియం సక్రమంగా అందుతూ ఎముకలు పటిష్టమవుతాయి. అలాగే మన శరీర  నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించే కండరాలు మరియు నరాలకు పుష్టిని కలిగిస్తుంది. శరీరంలో తయారయ్యే జీవకణజాలాన్ని కలిపి ఉంచే శక్తి కఫ గుణం వల్ల వస్తుంది. అలాగే మన శరీర భాగాలకు కావాల్సిన ద్రవాన్ని చేరవేసే ప్రక్రియ నిర్వర్తించేది కఫ గుణమే.

పైన చెప్పుకున్న మూడు గుణాలు మన శరీరాన్ని నిర్మించేవని ఇప్పటికే అర్థమై ఉంటుంది. అయితే ఈ మూడు గుణాలు అస్తవ్యస్తం అవ్వడం వల్ల శరీరంలో సప్తధాతువులు దెబ్బ తిని తమ క్రియలను మందగిస్తాయి.  మూడుగుణాలు సమపాళ్లలో ఉంచడానికి కొన్ని చిట్కాలు చూడండి.

మన శరీరంలో ఉన్న మూడు గుణాలను సమపాళ్లలో ఉంచడానికి అద్భుతంగా సహాయపడేది త్రిఫల చూర్ణం. ఇది ఆయుర్వేద మార్కెట్లలో విరివిగా దొరుకుతుంది ప్రతి రోజు రాత్రి నిద్రించే ముందు ఒక టీ గ్లాస్ నీళ్లలో ఒక స్పూన్ త్రిఫల చూర్ణం వేసి రాత్రి మొత్తం అలాగే ఉంచి ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల. మూడు గుణాలు సమపాళ్లకు సర్దుకుంటాయి.

అలాగే వాతాన్ని ఎక్కువ కలిగించే దుంపలు వంటివి ఎక్కువ తీసుకోకుండా పరిమితిలో వాడుకోవాలి

కఫాన్ని కలిగించే ద్రవపదార్థాలకు దూరంగా ఉండాలి

రుచిగా ఉందని దేన్ని పరిమితికి మించి తీసుకోకూడదు. త్రిఫల చూర్ణం మాత్రమే కాకుండా లేహ్యం, త్రిఫల గుళికలు( టాబ్లెట్స్) కూడా అందరికి సులువుగా దొరికేవే  కాబట్టి ఆహారాన్ని క్రమబద్ధీకరించుకుంటూ త్రిపలాన్ని వాడటం వల్ల సత్వర ఉపసమనం లభిస్తుంది.

Leave a Comment

error: Content is protected !!