మనం తీసుకునే ఆహారం మరియు జీవన శైలిలో మార్పులు వచ్చాక కడుపుకు సంబందించిన జబ్బులు కూడా ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా అజీర్తి, అల్సర్ పుండ్లు, పేగు సంబంద వ్యాధుల సమస్యలతో ప్రజలు ఎక్కువగా డాక్టర్లను సంప్రదిస్తున్నారు. అయితే ఆయుర్వేదం కావచ్చు, హోమియో కావచ్చు, ఇంగ్లీష్ వైద్యం కావచ్చు వైద్యం ఏదైనా కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల సమస్య తగ్గడంతో ఆ ఆహారం మరింత సమర్థవంతంగా తోడ్పడుతుంది, అలాగే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండటం వల్ల మరింత తొందరగా జబ్బు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. తీసుకోకూడని ఆహారపదార్థాలు తినడం వల్ల సమస్య దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంటుంది కాబట్టి తినదగిన మరియు తినకూడని పదార్థాలు ఏమిటో చూడండి.
తినదగిన పదార్థాలు
◆ పాత బియ్యాన్ని ఒక రాత్రి నానబెట్టి, పగలు మొత్తం ఎండబెట్టి ఆ బియ్యాన్ని దోరగా వేయించి రవ్వగా విసురుకోవాలి. ఆ రవ్వతో ఉప్మా లేకా జావ తయారుచేసుకుని తీసుకోవాలి. ముఖ్యంగా ఉప్మా లేక జావ తయారుచేసుకునేటపుడు అందులో కొంచం వాము పొడి, ఒక బిర్యానీ ఆకు వేసి వండి తినాలి. ఇలా చేయడం వల్ల తిన్న ఆహారం జీర్ణమవడమే కాకుండా కడుపుకు సంబందించిన సమస్యలు తగ్గడంతో దోహదపడుతుంది.
◆ ముడి గోధులను తెచ్చి ఇంట్లోనే గోధుమ నూక తయారుచేసుకుని వాడుకుంటే కడుపుకు సంబందించిన సమస్యలు తగ్గడంతో దోహదం చేస్తాయి.
◆ కందిపప్పు, పెసర పప్పు, ఉలవలు మొదలైన వాటితో కట్టు తయారుచేసుకుని తీసుకోవడం వల్ల గొప్ప ఫలితం ఉంటుంది.
◆ కడుపుకు సంబందించిన సమస్యలను తగ్గించుకునే క్రమంలో తీసుకునే ఆహారంలో బార్లీ ని చేర్చడం వల్ల ఉత్తమ ఫలితం ఉంటుంది. బార్లీని జావగా వండుకుని రెండు పూటలా తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
◆ జీర్ణక్రియను సమర్థవంతంగా చేయడానికి మరియు శరీరానికి ఉత్తేజాన్ని ఇవ్వడానికి గోరువెచ్చని నీళ్లతో కాసింత తేనె కలుపుకుని తాగడం వల్ల ఫలితం బాగుంటుంది.
◆ పలుచటి మజ్జిగ, లేదా పలుచటి మజ్జిగతో అన్నం కానీ తీసుకోవడం వల్ల జీర్ణక్రియను పెంపొందించి పేగులకు, జీర్ణాశయానికి ఆరోగ్యాన్ని చేకూర్చే బాక్టీరియా లభిస్తుంది.
◆ కూరగాయల్లో కాకరకాయ, ఉసిరికాయ, ముల్లంగి, ఉల్లిపాయ, అల్లం, బీరకాయ, పోట్లకాయ, దోసకాయలు, లేత ముల్లంగి దుంపలు, గాజరగడ్డలు, గలిజేరు ఆకు మొదలైనవి తీసుకోవచ్చు.
తీసుకోకూడని ఆహారం
◆ కొత్త బియ్యంతో వండిన అన్నంకు దూరం గా ఉండాలి. అలాగే సరిగా ఉడకకుండా ఎక్కువ పొడిగా ఉన్న అన్నం తినకూడదు.
◆ ముద్దపప్పు, ఉప్పు ఎక్కువ ఉన్న పదార్థాలు, చల్లగా ఉన్న పదార్థాలు తీసుకోకూడదు.
◆ మాంసాహారం, చేపలు వంటివి జీర్ణమవడానికి జీర్ణాశయ సామర్థ్యం చాలా అవసరం కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. మాంసం వండటానికి మసాలాలు అవసరం కాబట్టి మసాలాలు జీర్ణశయానికి హాని చేస్తాయి కనుకనే వాటికి దూరం ఉండాలి.
◆బెల్లంతో తయారుచేసిన పిండి వంటలు కడుపుకు సంబందించిన సమస్యలు తగ్గేవరకు తీసుకోకూడదు.
◆పెరుగన్నం, పులగము, పులులు పదార్థాలు మొదలైనవాటికి నిషేధించాలి. పెరుగు జీర్ణక్రియను మందగించేలా చేస్తుంది.
◆ వేపుడు కూరలు, వేయించిన శనగ, బఠాణీ, ఎండిన చేపలు వంటివి వదిలేయాలి.
◆ తొందరగా అరగని దుంప కూరలు, దాహాన్ని పెంచే పదార్థాలకు దూరంగా ఉండాలి.
◆ కడుపు సమస్యలు ఉన్నపుడు శరీరానికి నూనె పూసుకుని మర్దనా చేయకూడదు, అలాగే నీటిని ఎక్కువగా తాగకూడదు.
◆ సహజ చర్యలైన మలమూత్రాలను వీలైనంతవరకు నిర్బంధించకూడదు. వీటిని ఆపడం వల్ల కడుపులో వాయువులు ఉత్పత్తి అయి అవి వాతసమస్యలుగా మారతాయి.
◆ పగటి పూట నిద్రపోవడం, అతి వ్యాయామం వంటి అలవాట్లు నిషేధించాలి.
చివరగా……
పైన చెప్పుకున్నవన్నీ పాటిస్తూ వైద్యుడు సూచించిన మందులు వాడుతూ ఉంటే కడుపుకు సంబందించిన సమస్యలు అన్ని తొందరగా తగ్గిపోతాయి.