శుభకార్యాల్లో ఎక్కువగా కనిపించే పండు, నెలల పిల్లల నుండి పళ్ళూడిన ముసలివాళ్ళ వరకు తినదగిన పండు, దిగువ తరగతి కుటుంబాలకు కూడా అందుబాటు ధరలో దొరికే పండు. ఎవరైనా తాంబూలం ఇస్తే 90% తప్పకుండా ఉండే పండు.అబ్బా ఎన్ని చెప్పాలండి ఇప్పటికే అర్థం కాలేదా అరటిపండు అని. సరే ఇంతగా అరటి గూర్చి చెప్పడానికి కారణం. రోజుకు రెండు అరటి పండ్లు తింటే ఏమవుతుందో తెలియజేయడానికే.
◆అరటిపండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది అందువల్ల అరటిపండ్లు తీసుకున్నప్పుడు మన శరీరం లో ఉన్న నీటి శాతాన్ని తొందరగా ఆవిరైపోకుండా కాపాడుతుంది. దీనివల్ల శరీరం తొందరగా డీహైడ్రేట్ కు గురి అవ్వదు.
◆అరటిపండ్లను తీసుకున్నప్పుడు మన శరీరంలో ట్రైప్టోఫోన్ లను సెరోటోనిన్ గా మారుస్తుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తుంది.
◆ప్రతిరోజు రెండు అరటిపండ్లను తీసుకోవడం వల్ల అందులోని పొటాషియం, మెగ్నీషియం నరాలను చురుగ్గా మార్చి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతుంది.
◆రోజూ రెండు అరటిపండ్లు తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థ దృఢంగా తయారవుతుంది. అంతే కాదు మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థగా పని చేసే తెల్ల రక్తకణాల ఉత్పత్తిని పెంచుతుంది.
◆అరటిపండు ను రోజు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరం లో ఉన్న టాక్సిన్ లను బయటకు పంపుతుంది. ఇందులో పీచు ఎక్కువ శాతం ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే జీర్ణాశయంలో మంచి బాక్టీరియా ఎదుగుదలకు సహకరించి జీర్ణాశయ సమస్యలను నిర్మూలిస్తుంది.
◆అరటిపండులో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ పెరుగుదలకు సహాయపడుతుంది. అంతే కాదు ఇన్సులిన్ ను పెంచుతుంది. శరీరానికి కావలసిన అమైనో ఆమ్లాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.
◆రోజూ అరటిపండు తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు నివారించబడతాయి.
◆బలహీనంగా ఉన్నవారు ప్రతిరోజు ఉదయం పాలు, అరటిపండు, తేనె కలిపి మిల్క్ షేక్ లేదా అరటిపండు తిని తేనె కలిపిన పాలు తాగడం వలన బరువు పెరుగుతారు.
◆అరటిపండులో ఐరన్ ఎక్కువ ఉండటం వల్ల అనిమియాను అరికడుతుంది
◆అరటిపండులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. రోజు రెండు అరటి పండ్లు తినడం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి.
◆వ్యాయామం చేసేవారి డైట్ జాబితాలో అరటిపండు తప్పక ఉంటుంది. అలాగే క్రీడాకారులు కూడా అరటిపండు, గుడ్డు తప్పక తమ ఆహారంలో ఉండేలా చూసుకుంటారు దీనికి కారం వ్యయం వల్ల అలసిన కండరాలు తిరిగి తొందరగా ఉత్తేజితమవుతాయి. అలాగే కండరాల తిమ్మిర్లు తగ్గుతాయి.
చివరగా…….
అందరికి అందుబాటులో చవగ్గా లభించే అరటిపండు తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు ఆకలిని దరిచేరనివ్వదు. అందువల్ల బరువు తగ్గాలని అనుకునేవారు అరటిపండును తీసుకోవచ్చు. కాబట్టి తొక్కలో అరటిపండా అనకుండా అరటిపండును అమృతమైన ఫలంగా భావించి తీసుకోండి. మీ ఆరోగ్యాన్ని అరిటాకంత విస్తరించుకోండి.