what happens if we eat curd rice at night

రాత్రి పూట పెరుగు తింటున్నారా?? ఒక్కసారి ఇది చూడండి.

చంటి పాపాయిల నుండి ముసలివాళ్ళ వరకు సులువుగా తినగలిగే పదార్థము, జీర్ణం చేసుకునే పదార్థం ఏది అంటే పెరుగు అని చెబుతారు. పాలను తొడుపెట్టడం ద్వారా పెరుగు తయారవుతుందన్న సంగతి అందరికీ తెలిసినదే. రోజూ భోజనంలో పెరుగుతో ముగించనిది తిన్న తృప్తి ఉండదు. పెరుగులో ప్రోటీన్లు, విటమిన్లు, కొవ్వులు, పాస్పరస్, మినరల్స్, కాల్షియం, ఇనుము మొదలైనవి పుష్కలంగా ఉంటాయి. 

పెరుగులో విటమిన్-ఎ మరియు బి2 విటమిన్లు ఉంటాయి. ఆహారం సరిగా తీసుకోవడంలో నిర్లక్ష్యం చేసే వారికి పెరుగు ఉత్తమ ప్రత్యామ్నాయం. పెరుగు శరీరానికి పుష్టిని కలుగజేస్తుంది. దీనివల్ల సన్నగా ఉన్నవారు పెరుగు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.  అయితే చాలా మంది పెరుగును రాత్రిపూట తినకూడదని అంటారు అది ఎందుకు?? 

ఏమిటి??  అది నిజమేనా??  అయితే కారణం ఏంటి??  చూద్దాం రండి.

సాధారణంగా మన శరీరంలో వాత, పిత్త, కఫ అనే మూడు గుణాలు ఉంటాయని అందరికి తెలుసు. ఈ మూడు గుణాలు అసమతుల్యత వల్ల మన శరీరంలో జబ్బులు పుట్టుకొస్తాయని కూడా తెలుసు. అయితే పెరుగు ను రాత్రి పూట తినడం వల్ల మూడు గుణాలలో ఒకటైన కఫం ఎక్కువగా ఉన్నవారికి సమస్య అధికమవుతుంది. జలుబు, దగ్గు, గొంతు వంటి సమస్యలు ఉన్నవారు పెరుగును రాత్రి పూట తీసుకోవడం వల్ల కఫం పెరిగి సమస్య అధికమవుతుంది.

అలాగే పెరుగు శరీరాన్ని చల్లబరిచే గుణాన్ని కలిగి ఉంటుంది. రాత్రిపూట శరీరం చల్లబడటం వల్ల తిన్న ఆహారపదార్థం నెమ్మదిగా జీర్ణమవుతుంది. రాత్రిపూట ఎలాంటి శారీరక శ్రమ లేకుండా నిద్రపోవడం వల్ల అది అధిక బరువుకు దారితీస్తుంది. అయితే ఎలాంటి కఫం సమస్యలు లేని వారు రాత్రిపూట పెరుగును ఎలాంటి సందేహం లేకుండా తీసుకోవచ్చు. పెరుగులో బాక్టీరియలు మన జీర్ణవ్యవస్థను సంరక్షిస్తాయి. తిన్న ఆహారం అరుగుదలను వేగవంతం చేస్తుంది.  పరిశోధనల ప్రకారం పెరుగు తీసుకున్నప్పుడు గంటలో 91% జీర్ణమైతే, అదే గంటలో పాలు కేవలం 32% మాత్రమే జీర్ణమవుతుంది. కాబట్టి పాలలో ఉన్న కొవ్వుల కంటే  పెరుగులో తక్కువగా ఉంటాయి. 

ప్రతిరోజు పెరుగును తీసుకోవడం వల్ల చక్కని శరీరం మీ సొంతమవుతుంది. అయితే మధ్యాహ్నం పూట తీసుకున్న దాంతో పోలిస్తే రాత్రి పూట తీసుకోవడం ఒకింత తక్కువ ప్రయోజనాలే అని చెప్పవచ్చు. ఒకవేళ రాత్రి పూట పెరుగును తీసుకోవాలని అనిపించినపుడు పెరుగులో నీళ్లు వేసి బాగా గిలక్కొట్టి పలుచటి మజ్జిగలా తాగడం వల్ల మజ్జిగలో ఉన్న బాక్టీరియాలు మరియు పలుచని మజ్జిగ జీర్ణాశయాన్ని సమర్థవంతంగా నడిపిస్తూ ఆహారం చక్కగా జీర్ణం కావడంతో తోడ్పడుతుంది. 

చంటి పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి రాత్రి పూట పెరుగును పెట్టకపోవడమే మంచిది. ఇక పెద్దలు కూడా పెరుగుకు ప్రత్యామ్నాయంగా పలుచటి మజ్జిగ ఉపయోగించడం శ్రేయస్కరం. లేదు పెరుగు తప్పనిసరిగా తినాలని అనిపిస్తే పెరుగులో కాసింత శొంఠి వేసుకుని భోజనంలో ఉపయోగించడం వల్ల కఫ సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు. 

పెరుగు ఆరోగ్యానికి మంచిదే అయితే కొందరు అనారోగ్య సమస్యలు ఉన్నవారు రాత్రిపూట దానికి దూరంగా ఉండటం ఉత్తమం. పెద్దలు చెప్పిన రాత్రి పూట పెరుగును దూరం పెడదాం అనే మాటలో రహస్యం ఇదే మరి.

Leave a Comment

error: Content is protected !!