మలబద్ధకం రోజువారీ జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేయడంలో ముందుంటుంది. దీనివలన అసహనం, ఇబ్బంది కలుగుతుంది. మలబద్ధకం సర్వ రోగాలకు కారణమౌతుంది అనేది పెద్దలమాట. మలం పొట్టలో నిల్వ ఉండడం వలన అది రక్తంలో కలిసి అనేక రోగాలకు కారణమవుతుంది. అంతే కాకుండా గ్యాస్, చెడు వాసన, కడుపు నొప్పి, వికారం వంటి అనేక రోగాలను కలిగించడమే కాకుండా శరీరంలో ఇంతకుముందే ఉన్న రోగాలను పెంచడంలో కూడా కారణమవుతూ ఉంటుంది. మలబద్ధకం తగ్గించుకోవడానికి మంచి నీళ్లు తాగడం చాలా బాగా పనిచేస్తుంది.
అందులోనూ వేడి నీరు తాగడం వలన ప్రేగులలో మలం మెత్తబడి కదలికలు ఎక్కువవుతాయి. సుఖ విరోచనం అవ్వటంతో పాటు అనేక రోగాలను తగ్గించుకోవచ్చు. మలబద్దకానికి ఆయుర్వేదంలో ఒక చిట్కా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అదే త్రిఫల చూర్ణం. త్రిఫల చూర్ణం అంటే కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ కలిపి చేసిన చూర్ణం. ఇది మార్కెట్లో అందుబాటులో ఉంటుంది లేదా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మార్కెట్ లో దొరికే వాటిని తీసుకుంటే మంచి కంపెనీ వారివి మాత్రమే తీసుకోండి. లేకపోతే మంచి ఫలితాలు ఉండవు.
కరక్కాయలు, తానికాయలు, ఉసిరికాయలు తెచ్చి వాటి విత్తనాలు తీసేసి పెచ్చులు కింద కోయాలి. ఉసిరి కాయ, కరక్కాయ, తాని కాయ ముక్కలను బాగా ఎండబెట్టి మెత్తని పొడిలా చేయాలి. ఈ పొడిని ఒక గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకొని రోజు ఉదయాన్నే ఒక టీ స్పూన్ మిశ్రమాన్ని 200 ml నీటిలో వేసి 100 గ్రాములు అయ్యేంతవరకు మరిగించి ఒక గ్రాము ఉప్పు కలిపి తీసుకోవాలి. బీపీ సమస్య ఉన్నవారు ఉప్పును మానేసి నిమ్మకాయ రసంతో తీసుకోవాలి. మలబద్ధకం ఎక్కువగా ఉన్నవారు ఉదయం, సాయంత్రం తీసుకోవడం వలన మలబద్దకం సమస్య పూర్తిగా తగ్గుతుంది.
అంతేకాకుండా త్రిఫలలో శక్తివంతమైన శోథ నిరోధక సమ్మేళనాలు ఉన్నాయి, ఇవి కొన్ని క్యాన్సర్‌లు మరియు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. త్రిఫల చూర్ణం మలబద్ధకానికి చికిత్స చేయడంలో, దంత సమస్యలను పరిష్కరించడంలో మరియు బరువు తగ్గడాన్ని ప్రోత్సహించడంలో ఇది చాలా బాగా సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే శరీరంలో పేరుకున్న కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఒత్తిడిని తగ్గించండంలో సహాయపడుతుంది. వివిధ రకాల బ్యాక్టీరియా మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేస్తుంది.