మన శరీరానికి మనం అందించే ఆహారంలో తొందరగా జీర్ణమయ్యేది ద్రవపదార్థం. ద్రవ పదార్థాల నుండి శక్తి తక్కువగా లభించినప్పటికి ఇవి అనారోగ్య సమస్యలు, శస్త్రచికిత్సలు జరిగి ఘనాహారం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నవారికి చాలా మంచి చేస్తాయి. తొందరగా జీర్ణమవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు. అధిక బరువు మరియు కొన్ని సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఈ ద్రవాహాలను తీసుకోవడం వల్ల తొందరగా అనారోగ్యాన్ని తగ్గించుకోగలుగుతారు. ఈవిధంగా ద్రవాహారాన్ని తీసుకోవడాన్ని లిక్విడ్ డైట్ అని అంటారు. మరి ఈ లిక్విడ్ డైట్ ఆరోగ్యానికి ఎంతవరకు మంచిది, దీనివల్ల నష్టాలున్నాయా తెలుసుకోవాల్సిందే.
లిక్విడ్ డైట్ లో సాధారణంగా నీరు మాత్రమే ఉంటుందని అనుకుంటే పొరపాటు. పండ్ల రసాలు, కూరగాయల రసాలు, జావ, మజ్జిగ, గ్లూకోజ్ నీళ్లు, నిమ్మరసం తేనె కలిపిన నీళ్లు, పండ్లు కూరగాయలను తరిగి నిల్వచేసిన డిటాక్స్ వాటర్. మొదసలైనవి అన్ని లిక్విడ్ డైట్ కిందకి వస్తాయి.
లిక్విడ్ డైట్ వల్ల కలిగే ప్రయోజనాలు
◆ జీర్ణాశయాన్ని ఇబ్బంది పెట్టే సమస్యలైన వికారం మరియు వాంతులు, అతిసారం వంటి సమస్యలు ఎదురైనప్పుడు లిక్విడ్ డైట్ చాలా మంచిది. తొందరగా ఎలాంటి ఇబ్బంది లేకుండా జీర్ణమవడం వల్ల నిరభ్యరంతంగా తీసుకోవచ్చు.
◆లిక్విడ్ డైట్ తీసుకున్నప్పుడు పేగులకు శ్రమ తగ్గి విశ్రాంతి లభిస్తుంది.
◆ వికారం మరియు వాంతి వంటి వాటిని నివారించి సులభంగా జీర్ణక్రియ జరిగేలా చేస్తుంది.
◆లిక్విడ్ డైట్ తీసుకునేవారు అధిక శ్రమకు దూరంగా ఉండాలి లేకపోతే శరీరం చాలా అలసట, నీరసం కు గురయ్యి స్పృహతప్పే ప్రమాదం ఉంటుంది.
◆ పేగులను, జీర్ణాశయాన్ని శుభ్రం చేయడం తద్వారా మలబద్దకం వంటి సమస్యలను తగ్గించడమే కాకుండా శరీరంలో అదనపు కొవ్వులను కరిగించడంలో దోహాధం చేస్తుంది.
లిక్విడ్ డైట్ వల్ల నష్టాలు
◆ అనారోగ్య సమయంలో సొంతంగా ఈ లిక్విడ్ డైట్ పాటించడం ఆరోగ్యం మరింత దెబ్బ తింటుంది. దీన్ని 3 నుండి 5 రోజులకు మించి ఎక్కువరోజులు పాటించకూడదు.
◆పొషకాహార లోపం ఉన్నవారు లిక్విడ్ డైట్ కు దూరంగా ఉండాలి. లిక్విడ్ డైట్ ను ఒక క్రమపద్దతిగా తీసుకోవాలి. సమయవేళలు మరియు తీసుకోవలసిన వాటిని ఒక చార్ట్ లో సిద్ధం చేసుకోవాలి. లేకపోతే శరీర స్థాయి దిగజారుతుంది.
◆లిక్విడ్ డైట్ లో కృత్రిమ పళ్ల రసాలు, శీతల పానీయాలు చేర్చకూడదు. ఇవి శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి. తాజాగా ఉన్నవాటినే తీసుకోవాలి.
చివరగా….
లిక్విడ్ డైట్ అనేది ఆరోగ్యానికి మంచిదే అయినా దాన్ని వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాలి అలాగే నియమిత పరిమితిలో ఉండాలి. తీసుకునే ద్రవపదార్థాల విషయంలో అవగాహన చాలా ముఖ్యం.