వంట కు రుచి వచ్చేది పోపు తోనే. ప్రతి వంటకు పోపు లేకపోతే ఏదో మిస్సయిన ఫీలింగ్. ముఖ్యంగా పోపులో ఆవాలు లేకపోతే అది అసలైన వంటలా అనిపించదు. వేసవి వచ్చిందంటే ఘాటైన ఆవకాయ అధిరిపోవాలన్నా, ఆవ పెట్టిన కూరను ఆవురావురు మంటూ తినాలన్నా అన్నిటిలోకి ఆవాలు తప్పనిసరి. వంటింట్లో చిటపటలాడే ఆవాలు కేవలం రుచే కాదు బోలెడు ఆరోగ్యాన్ని కూడా చేకూరుస్తుంది.అయితే ఆ ప్రయోజనాలు చాలామందికి తెలియవు. ఆవాలతో దిమ్మతిరిగి పోయే ఆరోగ్య రహస్యాలు ఏమిటో ఒకసారి చూద్దాం మరి.
◆ కొబ్బరినూనె లేదా నువ్వుల నూనెలో తెల్ల ఆవాలను బాగా వేయించి ఆ నూనెను వడగట్టి నిల్వచేసుకోవాలి. ఈ నూనెను ప్రతిరోజు నాలుగైదు చుక్కలు ముఖానికి రాసి మెల్లిగా మర్దనా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొహం మీద మొటిమలు, మచ్చలు తగ్గిపోయి మొహం కాంతివంతం అవుతుంది.
◆ ఆవాలను గానుగలో ఆడించగా మిగిలిన పిండిని మెత్తగా నూరి శరీరానికి నలుగు పెట్టుకుని స్నానం చేస్తే కుష్టు, గజ్జి, తామర, చిడుము వంటి చర్మ సంబంధ వ్యాధులు తగ్గుతాయి.
◆ తలలో పేలు సమస్యతో బాధపడుతున్నవారు ఆవాలను మెత్తగా రుబ్బి తలకు పట్టించి గంట సేపయ్యాక తలా స్నానం చేయాలి. ఇలా చేస్తే తలలో పేలు పోతాయి.
◆జుట్టు ఒత్తుగా పెరగడానికి ఆవనూనె చక్కగా పనిచేస్తుంది. ఆవనూనెలో గోరింటాకులు వేసి కాచి వడపోసి రోజు తలనూనె గా వాడుతుండాలి. ఇలా చేస్తూ ఉంటే క్రమంగా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
◆ సర్పి వ్యాధి వచ్చినపుడు ఆహారంలో ఆవాలను ఎక్కువగా తీసుకుంటే నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.
◆ శరీరంలో ఎక్కడైనా చీము గడ్డలు వచ్చినపుడు ఆవనూనెలో హారతి కర్పూరం కలిపి పట్టు వేస్తే చీము గడ్డలు మెత్తబడి గడ్డలో నొప్పి తగ్గుతుంది.
◆ ఆవాలు, వస నూరి ఉడికించి ఆ మిశ్రమాన్ని పట్టువేస్తే వృషణాలలో వాపు తగ్గుతుంది, అంతేకాదు వృషణాలలో నీరు లాగేస్తుంది.
◆ ఆవాల పిండిని పేస్ట్ లా చేసి తామర వచ్చిన చోట రాస్తే తామర నుండి ఉపశమనం ఉంటుంది.
◆ ఆవాలను నూనెలో వేయించి, దంచి నీళ్లలో కలిపి తాగాలి. ఇలా చేస్తే వీరేచనాలతో బాధపడేవారికి మంచి ఉపశమనం ఉంటుంది.
◆పక్షవాతంలో ను మూతి వంకరపోయే వ్యాధిలోనూ( బెల్స్ పార్సీ) లోనూ ఆవనూనెను పట్టించి మర్దనా చేస్తూ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి.
◆ జ్వరం తీవ్రంగా ఉండి, చిన్న పిల్లలలో ఫిట్స్ వస్తున్నప్పుడు కాసిన్ని చన్నీళ్లలో కొద్దిగా ఆవాల పిండిని కలిపి ఆ నీళ్లతో శరీరాన్ని తడిపితే వెంటనే చల్లబడుతుంది.
చివరగా…..
పైన చెప్పుకున్న చిట్కాలను సందర్భానుసారంగా ఉపయోగిస్తూ ఉంటే అద్భుతమైన పలితాలు మీ సొంతమవుతాయి. ఆవగింజలను చిన్న చూపు చూడకండి మరి.