జలుబు, దగ్గు, తలనొప్పి లాంటి సాధారణ జబ్బుల జాబితాలో జ్వరం కూడా ఒకటి. ప్రకృతి విరుద్ధమైన మరియు శరీరానికి విరుద్ధమైన ఆహారాలను, అలవాట్లను అనుసరించడం వల్ల శరీరంలో త్రిగుణాలు అనబడే వాతం, పిత్తము, కఫము అనే దోషాలు అసమతుల్యత చెందడం వల్ల ఆమాశయంలో ప్రవేశించి వేడి పుట్టించడం వల్ల ఆ వేడి బయటకు చొచ్చుకొని వచ్చి జ్వరం రూపంలో బయటపడుతుంది.
జ్వరం వల్ల అవలింతలు, శరీరపు గగుర్పాటు కలుగుతాయి. శరీరం బరువుగా అనిపించడం, నోట్లో అరుచి, కళ్ళవెంట నీళ్లు కారడం, ఆయాసం, దప్పిక, కళ్ళు చీకట్లు కమ్మడం, చలిగా ఉండటం, మనసు స్థిమితంగా లేకపోవడం జరుగుతుంది. కొందరికి వేసవి ఎండ కుంపటిలానూ, మరికొందరికి వణికించే చాలిగానూ ఉంటుంది.
వాత జ్వరం అయితే ఆవలింతలు ఎక్కువగా ఉంటాయి, పైత్యం వల్ల కలిగే జ్వరం అయితే కళ్ళ మంటలు కలుగుతాయి, కఫము వల్ల వచ్చే జ్వరంలో నోటిలో రుచి తెలియకపోవడంతో పాటు జలుబు, తలనొప్పి కూడా జతగా ఉంటాయి.
జ్వరం వచ్చినపుడు తీసుకోవలసిన ఆహారం
◆ జ్వరం బారిన పడినప్పుడు ఆహారం విషయంలో జాగ్రత్తలు అవసరం. అన్నం నుండి వంచిన గంజి, రాగి జావ, పేలాల జావ మొదలైనవాటిని ఆహారంలో భాగం చేయాలి.
◆ పెసలు, శనగలు, ఉలవలు, సారపప్పు, కందిపప్పు మొదలైన దాన్యాలతో తయారుచేసిన కట్టును తీసుకోవచ్చు.
◆ పోట్లకాయ, బీరకాయ, సొరకాయ, కాకరకాయ, లేత ముల్లంగి, తిప్పతీగ ఆకు మొదలైనవాటిని కూరలుగా చేసి పెట్టాలి.
◆ నోటి అరుచి పోవడానికి నిమ్మ, దానిమ్మ, ఉసిరి వంటి వాటి రసాలు తాగవచ్చు.
◆ నీరసన్ని భర్తీ చేసుకోవడానికి కొబ్బరినీళ్లు బాగా ఇవ్వవచ్చు. ఇది నీరసాన్ని తగ్గించడమే కాకుండా ఒంట్లో వేడిని తగ్గిస్తుంది.
◆ అతి వేడిగా ఉన్నవి కానీ, అతి చల్లగా ఉన్నవి కానీ తీసుకోకూడదు. పదార్థం ఒక మోస్తరు వేడిగా ఉన్నపుడు తినడం మంచిది. అలాగే వేడి నీటిని గోరువెచ్చగా ఉన్నపుడు తాగడం ఉత్తమం.
◆ జ్వరంవచ్చినపుడు అధిక దాహం కలగడం మాములే, దీన్ని తగ్గించుకోవడానికి ఒక గ్లాసు మంచి నీళ్లలో రెండు స్పూన్ల ధనియాలు వేసి దాదాపు 5 నుండి 6 గంటల వరకు నానబెట్టాలి. తరువాత వడగట్టి ఆ నీటిలో కాసింత పంచదార కలిపి తాగుతుంటే శరీరంలో చలువ చేసి అధిక దాహం తగ్గుతుంది.
◆ స్వచ్ఛమైన నెయ్యిని లేక తేనెను తీసుకుని 5గ్రాముల కరక్కాయ బెరడు చూర్ణం కలిపి బాగా మిక్స్ చేయాలి. దీన్ని వేలితో తీసుకుని మెల్లిగా నాకుతూ చప్పరిస్తూ తినాలి. ఇలా చేయడం వల్ల జ్వరం వల్ల కలిగే అతి దాహం తగ్గుతుంది.
చివరగా…..
జ్వరం వచ్చినపుడు పైన చెప్పుకున్న చిట్కాలు మరియు ఆహారపదార్థాలు తీసుకుంటే శరీరం నీరసపడకుండా ఉంటుంది.