నేటి వేగవంతమైన ప్రపంచంలో మనిషిలో మానసిక ఒత్తిడి, అనారోగ్యం తొలగి జీవితం సంతోషంగా ఉండటానికి ఒక ప్రకృతి సిద్ధమైన ఔషధం ఏదైనా ఉందా అని వెతికితే యోగ అనే అద్భుతమైన అమృత ధార లాంటి పద్దతి మన మనకు సాక్షాత్కరిస్తుంది.
యోగ అనే రెండక్షరాల పదం జీవితంలో పాటిస్తే మనసు, శరీరం రెండింటిని ఏకం చేసి మన జీవితానికి సరికొత్త నిర్వచనం ఇస్తుంది. అంతటి శక్తివంతమైన యోగతో ఇంతటి అద్భుతం ఎలా సాధ్యం అని అన్వేషిస్తే ఎన్నో విషయాలు తెలిశాయి.
వాటిలో కొన్ని ముఖ్యమైనని మీకోసం
భారతదేశమొక ఆధ్యాత్మిక నిలయం. ఒకప్పుడు బౌద్ధ, జైన, హిందూ మతాల జీవితంలో రోజువారీ కృత్యాలలో యోగ ఒక భాగం. ఆధ్యాత్మిక సాధనలో భాగంగా మహర్షులు ఆచరిస్తూ దీనికి ఒక గొప్ప స్థానాన్ని పదిలం చేశారు. ఉషోదయాన సూర్యుని వెలుగు ఆస్వాదిస్తూ చేసే సూర్యనమస్కారాలతో మొదలయ్యే యోగా సృష్టిలో గొప్ప శక్తిని మనకు అందించేది. అయితే వేగవంతమవుతున్న ప్రపంచంలో యోగ క్రమంగా తగ్గిపోయింది. దాన్ని ఆచరించేవాళ్ళు తగ్గిపోయారు కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన మనిషిని చుట్టుముట్టిన అనారోగ్య సమస్యలు, అశాంతి, మానసిక ఒత్తిడి మళ్ళీ యోగ వైపుకు నడిచేలా చేశాయి.

కేవలం ఉఛ్వాస, నిశ్వాశ లను క్రమబద్దీకరిస్తూ పద్మాసనం లేక వజ్రాసనం లో కూర్చుని చేసే ధాన్యం కూడా యోగ లో భాగమే. మనసును శరీరాన్ని బాహ్య ప్రపంచానికి జీవితంలో ఉన్న సమస్యలకు దూరం చేసి మనల్ని మనలో ప్రపంచానికి తీసుకెళ్లి ఆత్మవిమర్శ చేయించి మన ప్రశ్నలకు మనలోనే జవాబులు సూచించి. మనల్ని ఒక సంపూర్ణ వ్యక్తిత్వంగా తీర్చిదిద్దేది యోగ. అలాగే మన శరీరంలో అసమతుల్యతలను క్రమబద్దీకరించి బిపి, షుగర్ లాంటి సమస్యలను ఔషధం లేకుండానే అదుపులో ఉంచుతుంది.

ఇక యోగాలో భాగంగా వేసే ఆసనాలు ఎన్నో ఉన్నప్పటికీ సూర్యనమస్కారాల ద్వారా శరీరంలో ప్రతి అవయవం ఉత్తేజం చెంది తన కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ శరీరాన్ని దృఢపరుస్తుంది. శరీరంలో కొన్ని సమస్యలు ఉన్నవారు ఆ భాగానికి బలాన్ని చేకూర్చే విధంగా ఆసనాలు వేయడం వల్ల తొందరగా సమస్య నుండి బయటపడచ్చు.

అయితే యోగాను అనుసరిస్తున్నవారు ఆహారంలో కూడా మార్పులు చేసుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా యోగాను ఆచరించే వారు సాత్వికాహారాన్ని తీసుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు సొంతమవుతాయి. మసాలా దినుసులు, కొవ్వు నిల్వలు పెంచే ఆహారపదార్థాలు, మాంసం, నిల్వ ఉంచిన పదార్థాలు. అతి ఉప్పు, కారం, పులుపు, నూనెలో ఎక్కువ వేగిన పదార్థాలు, కృతిమ శీతల పానీయాలు వంటివి నిషేదించుకోవాలి.

తాజా ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, వేడి ఆహారం, వండవలసిన పదార్థాలను వండి తినడం, పచ్చిగా తినేందుకు నిర్దేశించిన వాటిని పచ్చిగా తీసుకోవడం. తాజాగా తీసిన పండ్ల రసాలు. నెయ్యి, వెన్న వంటివి ఉపయోగించాలన్నా చాలా కొద్ది మితంగా వాడటం. కుదిరితే పంచదారకు ప్రత్యామ్నాయంగా బెల్లం, కండచెక్కెర వంటివి వాడటం. రోజువారీ వంట నూనెగా గానుగ నూనెలు వాడటం.
ప్రతిరోజు యోగాలో భాగంగా పై సూచించిన ఆహారాన్ని తీసుకుంటే ఏ కాలమైనా వందేళ్ల ఆయుష్షు ఖాయం. అందుకే యోగాయుష్మాన్ భవ…………. డబ్బు పెట్టి కొనక్కర్లేని అద్భుతమైన ఔషధం ఇదే…..