ఎండాకాలంలో చల్లగా ఉంటే బాగుండు అనుకోవడం, చలికాలంలో ఎండ లేదేంటబ్బా ఎండ వస్తే బాగుండు అనుకోవడం సహజం. అయితే వచ్చిన చిక్కంతా సర్రుమనిపించే ఎండ చురుక్కుమనిపిస్తుంది, లేదా గిలిగిలి పెట్టి కొరికేసే చలి గిరగిరా మనచుట్టూ తిరిగినట్టు అనిపిస్తుంది. ఇదంతా కాలానుగుణంగా వచ్చేది కాబట్టి మన చేతుల్లో ఉన్నది కేవలం వాటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడమే.
ప్రస్తుతం చలికాలం వచ్చేసింది ఉదయాన్నే పొగమంచు తో కలిసి మరీ దాడిచేస్తోంది. ఇది ఇంకా మొదలు మాత్రమే ముందు ముందు చలి పంజా ఇంకా ఎక్కువ దెబ్బ వేస్తుంది. శరీర తత్వాన్ని బట్టి ఈ చలికి ఎక్కువ భయపడుతుంటాం. ముఖ్యంగా పొడి చర్మం గలవారు, పిల్లలు, వృద్ధులు ఈ చలికి నరకయాతన అనుభవిస్తారు. అందుకే చలికాలంలో అందరూ తీసుకోవలసిన చిన్నపాటి జాగ్రత్తలు మీకోసం చూడండి మరి.
◆ చలికాలంలో చలి నెపంతో నీళ్లు తక్కువ తాగుతుంటారు. దీనివల్ల చర్మం తొందరగా పొడిబారుతుంది. ఇలా పొడిబారిన చర్మం పగుళ్లుగా మారి దురద పెట్టడం, ఆ ప్రాంతాల్లో ఎక్కువగా గీకడం వల్ల చర్మం పుండ్లుగా మారే అవకాశం ఉంటుంది.
◆ చలికాలంలో స్నానం కు ఉపయోగించే సోప్ లు కూడా ప్రభావితం చేస్తాయి. గాఢత గల సోప్ లు ఉపయోగించకపోవడం ఉత్తమం. వాటి స్థానంలో గ్లిజరిన్ సోప్ లు లేదా బేబీ సోప్ లు( వీటిలో గాఢత తక్కువగా ఉంటుంది, రసాయనాలు ఎక్కువ ఉండవు) వాడచ్చు. అన్నిటికంటే ఉత్తమమైనది మన పెద్దవాళ్ళు చెప్పే చిట్కా శనగపిండి ఉపయోగించడం

◆ ముఖానికి ప్రతిరోజు పడుకునే ముందు కొబ్బరి నూనె లేక పెట్రోలియం జెల్లీ రాసుకోవడం ఉత్తమం. ఎక్కువ పగుళ్లు వచ్చిన చర్మానికి ఆముదం లేక నువ్వుల నూనె రాయడం వల్ల చర్మం తొందరగా రికవర్ అయ్యి సాధారణ స్థితిలోకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.
◆బాడీ లోషన్లు, మాశ్చరైజింగ్ క్రీములు కొందరికి ఒంటవు అలాంటి వాళ్ళు పాలమీగడ పట్టించి పది నిమిషాల తరువాత సాధారణ నీటితో కడిగేసుకోవాలి. దీనివల్ల చర్మం తేమగా, పొడిబారకుండా ఉంటుంది.
◆చలి నెపంతో చాలా వేడిగా ఉన్న నీటితో స్నానం చేయకూడదు దీనివల్ల పగిలిన చర్మం మరింత మంట, నొప్పికి లోనయ్యి అవి మొండి గాయాలుగా మరే ప్రమాదం ఉంటుంది.
చివరగా…
పైన చెప్పుకున్న తేలికపాటి చిట్కాలతో పాటు పగిలిన చర్మానికి తగిలేలా బాడీ స్ప్రే లు, పెర్ఫ్యూమ్ లు వంటివి ఉపయోగించకుండా దూరంగా ఉండాలి. చలికి విరుగుడుగా స్వేట్టర్లు, కాళ్లకు, చేతులకు సాక్సులు, గ్లౌజులు వంటివి ఉపయోగించాలి. ఇలా చేస్తే చలిని కూడా వెచ్చగా ఆస్వాదించవచ్చు.
Hello nice remedies ,very useful to all,small suggest plse chala hair fall avtundhi remedy amina untye chapandhi,it will useful to me