తమలపాకు అపుడపుడు గానీ అలవాటు ఉన్నవాళ్లు రోజు కానీ తాంబూలంగా వాడుకోవడం. శుభకార్యాలు, పండుగల సమయంలో తప్పనిసరిగా ఉపయోగించడం ఇవి మాత్రమే మనకు తెలుసు. కానీ తమలపాకును వైద్యపరంగా కూడా వాడతారని పెద్దగా ఇప్పటి తరానికి తెలియదు. తమలపాకులో ఔషధ గుణాలు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే.
తమలపాకులో ఏముంది??
కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఎ విటమిన్. సి.విటమిన్ లు తమలపాకులో పుష్కలంగా వున్నాయి. తాంబూలం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఫైబర్ – అంటే పీచు పదార్ధం తమలపాకులో చాలా ఎక్కువగా వుంటుంది. ఆకుకూరలు ఏవిధంగా అయితే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయో తమలపాకులు కూడా అలాగే, అంతకంటే ఎక్కువగా పని చేస్తాయి.
తమలపాకు రుచి ఏంటి??
తమలపాకును సంస్కృతంలో ‘తాంబూలీ’ అని ‘నాగవల్లి’ అని ‘భక్షపత్ర’ అని అంటారు. ఇవి చిరు చేదు, కారం, తీపి రుచులు కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల అటు వేడి చేయకుండా, ఇటు చలువ చేయకుండా శరీరాన్ని సమశీతోష్ణస్థితిలో ఉంచుతాయి.

తమలపాకుతో ఆరోగ్యం
తమలపాకుతో బోలెడంత ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవచ్చు అందుకోసం కొన్ని చిట్కాలు మీకోసం.
◆ చిన్న పిల్లలలో ఉబ్బసం వ్యాధికి తమలపాకు చక్కగా పనిచేస్తుంది. తమలపాకుకు ఆముదం రాసి దానిని సెగ మీద వేడి చేసి వెచ్చని ఆకును పిల్లల పొత్తికడుపు మీద వేసి కాపడం పెట్టాలి. దీనివల్ల శ్లేష్మం కరిగిపోయి శ్వాశనాళాలు శుద్ధమై పిల్లలలో ఉబ్బసం తగ్గిపోతుంది.
◆ఏడు లేత తమలపాకులను ముద్దగా నూరి తగినన్ని వేడి నీళ్లలో వేసి కలిపి కొద్దిగా ఉప్పు చేర్చి తాగుతూ ఉంటే బొదకాలు వ్యాధి నయమవుతుంది. అయితే దీనికి ఆయుర్వేద వైద్యుల సూచన తీసుకోవడం ఉత్తమం.
◆తమలపాకు తొడిమలను దంచి రసం తీసి రోజూ ఉదయం పూట కళ్ళలో ఒకటి రెండు చుక్కల రసం వేస్తూ ఉంటే క్రమంగా కంటి దురదలు, కురుపులు, నొప్పులు మాత్రమే కాకుండా రేచీకటి కూడా తొలగిపోయి మంచి చూపు సొంతమవుతుంది.
◆తమలపాకు రసం ఒక చెంచా, తేనె ఒక చెంచా కలిపి రోజూ రెండు పూటలా తాగుతుంటే శ్లేష్మం పోయి దగ్గు తగ్గుతుంది.
◆తమలపాకు చెట్టు వేరు, మిరియాలు సమంగా తీసుకుని వాటిని బాగా నూరి ముద్ద చేసి కాసింత ముద్దను బుగ్గన పెట్టుకుని చప్పరిస్తూ ఆ రసాన్ని మింగుతుంటే గొంతు నొప్పులు, బొంగురు గొంతు పోయి మంచి గొంతు మీ సొంతమవుతుంది.
◆వేడిగా ఉండే తమలకు రసాన్ని కొబ్బరినూనెతో కలిపి బాగా కలిపి, వెన్నుకు మర్ధన చేయడం వల్ల తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.
◆ శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నవారు తమలపాకులకు నూనెను రాసి కొద్దిగా వేడిచేసి ఎదపై ఉంచితే శ్వాసకోశ వ్యాధులు తగ్గిపోతాయి.
◆తమలపాకు జ్యూస్ తీసుకోవడం వల్ల నరాల బలహీనత మటుమాయం అవుతుంది.
ఇన్ని చిట్కాలు చెప్పుకున్నాం కదా మీకోసం మరొక కానుక.

కస్తూరి మాత్రలు.
ఇవేంటి అని అనుకోకండి చిన్నపిల్లలకు ఒక మంచి కానుక ఇది.
తమలపాకులను సెగ మీద వాడ్చి రసాన్ని తీసి ఆ రసంలో తగినంత కస్తూరి కలిపి బాగా నూరి ఆ మిశ్రమంను సన్నటి ఆవగింజ అంత పరిమాణంలో మాత్రలు చేసి నిల్వచేసుకోవాలి. వీటిని దగ్గు, జలుబు, వాతము సమస్యలు వచ్చినపుడు పిల్లలకు వాడుతూ ఉంటే తొందరగా సమస్యలు తగ్గిపోతాయి.
చివరగా…..
తమలపాకును పూజలు, శుభకార్యాలలోనే కాదు ఇదిగో పైన చెప్పుకున్నట్టు బోలెడు పద్ధతుల్లో వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఎందుకు మరి ఆలస్యం మీ ఇంట్లో ఒక తమలపాకు తీగను పెంచే పనిలో మునిగిపోండి