ముఖం జిడ్డు కారుతూ ఉంటే ఆస్తమాను ముఖాన్ని నీటితో కడుగుతూ ఉండడం లేదా మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడుతూ ఉండడం చేస్తూ ఉంటారు. కానీ వీటి వలన అప్పటికి ప్రయోజనం ఉన్నా మళ్లీ కొంతసేపటికి జిడ్డు పట్టెస్తూ చేస్తూ ఉంటుంది. ఇలా జిడ్డు కారేటప్పుడు బయటకు వెళ్లాలన్నా, నలుగురిలో తిరగాలన్నా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు.
అలాంటి వారు బయట నుండి చేసే ఇలాంటి పనులు ఉపయోగం లేకపోగా సమస్యను మరింత జటిలం చేస్తాయి. ముఖంపై సహజంగా విడుదల అవ్వాల్సిన తైల గ్రంథులను కూడా నష్టం చేకూరుస్తాయి. ముఖం జిడ్డు కారడానికి అసలు సమస్య శరీరంలో పేరుకుపోయిన మలినాలు. ఇవి ఎక్కువగా ముఖం నుండి బయటకు వస్తూ ఉండటం వలన ఈ జిడ్డులో దుమ్ము, ధూళి చేరి మొటిమలు, గడ్డలు వచ్చే అవకాశం ఉంటుంది.
ముఖం కూడా అందవికారంగా తయారవుతుంది. అసలు శరీరంలో పేరుకుపోయిన మలినాలను ఎలా తొలగించుకోవాలి. రోజూ మూడున్నర నుండి నాలుగు లీటర్ల నీటిని తాగడం వలన శరీరంలో పేరుకున్న మలినాలు చెమట రూపంలో బయటకు పోతాయి. అలా కాని పక్షంలో ముఖంలోని గ్రంథుల ద్వారా బయటకు వస్తూ ఉంటాయి.
అలాగే ఆహారపు అలవాట్లు కూడా ముఖం జిడ్డు కారడానికి కారణమవుతుంటాయి. ఎక్కువగా మసాలాలు, జంక్ ఫుడ్, మాంసాహారం తినే వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. వీలైనంతగా కూరగాయలు, ఆకుకూరలకు మారి ఉదయాన్నే కూరగాయల జ్యూస్ ఒక గ్లాసు, సాయంత్రం కావలసినన్ని రెండు మూడు రకాల పండ్ల ముక్కలతో మాత్రమే డిన్నర్ చేయగలిగితే శరీరంలో ఉండే మలినాలు తొలిగిపోవడమే కాకుండా రక్తం శుద్ధి అవుతుంది.
రక్తం ఎంత స్వచ్ఛంగా ఉంటే ముఖం అంత కాంతివంతంగా తయారవుతుంది. అలాగే ముఖానికి ఆవిరి పట్టడం కూడా జిడ్డు తగ్గేందుకు సహాయపడుతుంది. ఆవిరి పట్టడం వలన ముఖంపై పేరుకున్న దుమ్ము, ధూళి బయటకు పోయి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రోజుకు ఒకసారి చెమట పట్టేంతవరకు ఆవిరి పట్టడం వలన సాగిపోయిన ముఖంలోని రంద్రాలు మూసుకుని జిడ్డుపట్టడం తగ్గుతుంది.
ఇలా శరీరానికి తగినంత నీటిని తాగడం, ఆవిరిపట్టడం, మసాలాలు లేని మంచి ఆహారం తినడం పండ్ల రసాలు, పండ్లను తీసుకోవడం వలన శరీరానికి కావలసిన పోషకాలు అందిస్తూ అనారోగ్యాలనుండి కాపాడడంతో పాటు ముఖంపై జిడ్డుని తొలగించేందుకు అంతర్గతంగా పనిచేస్తాయి.