best-winter-skincare-tips-for-women

చలికాలంలో చర్మ సంరక్షణకు ఇంట్లోనే ఫేస్ వాష్ తయారు చేసుకుందామిలా….

చలికాలం ఒళ్ళంతా గిలిగిలి పెడుతుంది. చర్మ తత్వాన్ని బట్టి సమస్యలు కూడా చుట్టుముడతాయి. ముఖ్యంగా పొడి చర్మం ఉన్న వాళ్ళ భాధ వర్ణనాతీతం. ఎన్నెన్నో లోషన్లు, మరెన్నో క్రీములు వాడుతుంటారు. ముఖ్యంగా ముఖాన్ని కాపాడుకోవాలంటే బోలెడు బెంగ పడుతుంటారు. పూట పూటకు చర్మం పొడిబారిపోతుంటే ఏదో ఒకటి పూస్తూనే ఉంటారు. కొందరికి ఏది ఉపయోగించినా ఫలితం ఉండదు. 

   పొడి చర్మం ఉన్న వారు ముఖ్యంగా గ్రహించవలసినది చర్మాన్ని కాపాడుకోవాలంటే రసాయనాలు కలిసిన లోషన్లు, సబ్బులు వాడితే అది తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇస్తుందేమో కానీ వాటిని అలా వాడుతూనే ఉండాలి. ఎపుడైనా  ఏ పూట అయినా మిస్సయితే చర్మం  మొత్తం అట్ట కట్టుకుపోయి, దురద పుట్టించి అది పగుళ్లు ఆ తరువాత చర్మం పేలిపోవడం, రక్తం కారడం వంటి పెద్ద సమస్యలకు దారి తీస్తుంది.

   వీటన్నిటిని నిర్మూలించుకోవడానికి కొన్ని సహజ పద్ధతులు ఉపయోగిస్తూ కొబ్బరినూనె, కలబంద లాంటి సహజమైనవి మరియు ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి గ్లిజరిన్ సబ్బులు, ఫేస్ వాష్ లు ఉపయోగించినా ఈ సబ్బులు వల్ల, ఫేస్ వాష్ ల వల్ల ఫలితం ఆశించినంతగా ఉండకపోవడమే కాకుండా ఖరీదు కూడా ఎక్కువే. సాధారణ మధ్యతరగతి వారికి వీటిని కొనుగోలు చేయడం కాసింత ఇబ్బందే. 

 మరి సాధారణ మధ్యతరగతి వారు కూడా సులువుగా ఉపయోగించే మరియు తయారు చేసుకోగలిగే సహజమైన ఫేస్ వాష్ ఒకటుందని అది మన ఇంట్లో దొరికే పదార్థాలతోనే తయారు చేసుకోవచ్చని చాలా మందికి తెలియదు. మరి చలికాలంలో చర్మానికి గొప్ప రక్షణ ఇచ్చే ఫేస్ వాష్ మరియు దానికి కావలసిన పదార్థాలు, తయారు విధానం ఒకసారి తెల్సుకుందాం చదవండి మరి.

అన్ని ఇంట్లో దొరికెవి మరియు తయారు విధానం కూడా చాలా సులువు. 

కావలసినవి

  • శనగపిండి : 1టేబుల్ స్పూన్
  • పెరుగు : 1టేబుల్ స్పూన్
  • తేనె : ½ టేబుల్ స్పూన్

పైన చెప్పుకున్న పదార్థాలు అన్ని ఒక చిన్న గిన్నెలో వేసి మిక్స్ చేసుకోవాలి. దీన్ని ముఖం కడుక్కునేటపుడు ఫేస్ వాష్ గా ఉపయోగించాలి. ముఖాన్ని కనీసం రెండు నిమిషాల పాటు దీంతో బాగా సున్నితంగా మసాజ్ చేసుకున్నట్టుగా రుద్దుతూ తరువాత సాధారణ నీళ్లతో కడిగేసుకోవాలి.  దీన్ని ఎప్పటికపుడు ఫ్రెష్ గా తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఎలాంటి కష్టతరమైన పని కూడా కాదు. కేవలం రెండు సార్లు ఉపయోగించగానే ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోవడం మీవంతు అవుతుంది. 

ముఖ్యంగా శగపిండి బెస్ట్ క్లీనింగ్ ఏజెంట్ గా పని చేస్తుంది, ఇందులో మనం వాడుకున్న పెరుగు సహజమైన మాశ్చరైజర్ గా ప్రభావం చూపిస్తుంది. తేనె చర్మాన్ని తేమగా ఉంచడంలో మరియు వదులుగా ఉన్న చర్మాన్ని బిగుతుగా చేయడం లో సహాయపడుతుంది. ఇవి మూడు వంటింట్లో మనకు లభించేవే కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా దుష్ప్రభావాల భయం లేకుండా ఉపయోగించవచ్చు.

చివరగా…..

వందలు పెట్టి బయటి ఉత్పత్తులు వాడటం కంటే సహజమైన ఈ ఫేస్ వాష్ వల్ల చర్మం చలికాలంలో ఆరోగ్యంగా ఉండటం మాత్రమే కాకుండా మచ్చలు, మొటిమలు, అవాంఛిత రోమాలు మొదలైన అన్నిరకాల సమస్యలు కూడా మాయమైపోతాయి. మరి ఫేస్ వాష్ తయారు చేసుకుని వాడేయండి.

Leave a Comment

error: Content is protected !!