చర్మ సంరక్షణలో మహిళలు ముందుంటారు. ముఖ్యంగా ప్రతి మహిళ తన ముఖం అందంగా కనిపించాలని అనుకుంటుంది. అయితే వేగవంతమైన కాలంలో దుమ్ము, ధూళి, తీసుకునే ఆహారం వీటి వల్ల చర్మం ప్రభావితమవుతుంది. ఫలితంగా మచ్చలు, మొటిమలు, ట్యాన్, పిగ్మెంటేషన్ లాంటి సమస్యలు తరుచుగా వేధిస్తూనే ఉంటాయి. అయితే వీటిని పరిష్కరించుకోడానికి బోలెడు సౌందర్య ఉత్పత్తులపై ఆధారపడుతున్నారు. వందలు వేలు వెచ్చించినా ఆశించిన ఫలితం కూడా ఉండట్లేదు. అందుకే రసాయనాలు జొప్పించి వాటికి అంత వెచ్చించడం అనవసరమని, సహజంగా మనకు లభ్యమయ్యేవాటితో మనమే గొప్ప అందాన్ని పొందవచ్చని చెబుతారు.
ముఖ చర్మపు మచ్చలను, పేరుకుపోయిన మృత కణాలను తొలగించి చర్మాన్ని శుభ్రపరిచేది, చర్మానికి కాంతిని చేకూర్చి తాజాగా, మృదువుగా ఉంచేది అయిన విటమిన్స్ సమ్మేళనమైన విటమిన్ సి సీరం, మరియు విటమిన్ సి టోనర్ ఉపయోగించడం వల్ల ముఖం చంద్రబింబం అవుతుంది. మరి వీటిని సహజంగా మనమే తయారుచేసుకుని ముఖారవిందాన్ని సొంతం చేసుకోవచ్చు. వాటికి కావాల్సిన పదార్థాలు, తయారువిదానం, వాటిని ఎలా ఉపయోగించాలి చూద్దాం రండి.
విటమిన్ సి సీరం
విటమిన్ సి సీరం అనేది చర్మాన్ని అందంగా, కాంతివంతంగా, యవ్వనంగా మార్చే అద్భుతమైన వనరు. దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా సులువు మరియు వాడటం కూడా ఎలాంటి కష్టం కాదు.
నారింజ పండు తొక్కలను సేకరించుకోవాలి. ఒక గ్లాస్ నీటిలో నారింజ తొక్కలను వేసి స్టవ్ మీద బాగా మరగబెట్టాలి. ఇలా చేసేటపుడు నారింజలోని సిట్రస్ నీళ్లలోకి చేరి సమర్థవంతంగా తయారవుతుంది. రెండు నుండి మూడు నిమిషాల పాటు మరగబెట్టాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత ఒక స్ప్రే బాటల్ లో వేసుకుని నిల్వచేసుకోవాలి. దీన్ని వారం రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు.
ఈ నీటిని ముఖానికి స్ప్రే చేసుకుంటూ ఉండాలి తరువాత కాటన్ బాల్ తో సున్నితంగా ముఖమంతా తుడుచుకోవాలి. ఇలా చేస్తుంటే ముఖంలో మృతకణాలు, మలినాలు అన్ని పోతాయి. చర్మం తాజాగా అవుతుంది. ముఖం మీద ముడుతలు, చారలు, మొటిమల తాలూకు గుర్తులు అన్ని తగ్గిపోతాయి.
విటమిన్ సి టోనర్
విటమిన్ సి టోనర్ చర్మ సంరక్షణకు సమర్థవంతంగా పనిచేస్తుంది. చర్మానికి మెరుపును తీసుకొచ్చి చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది. అతినీల లోహిత కిరణాల వల్ల చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది.
టోనర్ తయారీకి కావలసిన పదార్థాలు:
నారింజ తొక్కల పొడి : స్పూన్( నీడలో ఎండబెట్టి గ్రైండ్ చేసి జల్లించుకుని మెత్తని పొడి చేసుకోవాలి)
కలబంద గుజ్జు : స్పూన్
రోజ్ వాటర్ : 2 సూన్లు
విటమిన్ ఇ టాబ్లెట్లు : 5
పై చెప్పుకున్న పదార్థాలు అన్ని బాగా మిక్స్ చేసుకుని ఒక చిన్న కంటైనర్ లో నిల్వ చేసుకోవాలి. దీన్ని రోజు రాత్రి పూట పడుకునే ముందు ముఖానికి నైట్ క్రీమ్ లాగా రాసుకుని పడుకోవాలి. ఉదయాన్నే ముఖం కడుక్కోవాలి.
చివరగా…..
పైన చెప్పుకున్న టోనర్, సీరం రెండింటిని వాడుతుంటే అతి తొందరగా అద్భుతమైన ఫలితాన్ని చూడచ్చు. సహజమైన పద్దతిలో అందాన్ని సొంతం చేసుకోవడం వధులుకోకండి మరి.