వానొస్తే వేడివేడిగా తినడం, ఎండోస్తే చల్లచల్లగా సేదతీరడం మనకు అలవాటైపోయిన పని. ముఖ్యంగా ఎండాకాలం వస్తే పెద్ద ఇనుప బండ మీద పడ్డట్టు విలవిల్లాడిపోతాం. దానికి ఉపశమనంగా చల్లగా ఐస్ క్రీములు, కూల్ డ్రింక్ లు తాగినా అవన్నీ తాత్కాలిక ఉపశమనాలే. అరగంట తిరగకనే మళ్ళీ తాపం మొదలవుతుంది. దీనికి మంచి విరుగుడు అంటే శరీరానికి చలువ చేసే పదార్థాలు తీసుకోవడం. ముఖ్యంగా నీటి శాతం అధికంగా కలిగి ఉన్న పళ్ళు, కాయలు తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం భర్తీ అవుతూ శరీరం డీహైడ్రేట్ కు గురి కాకుండా ఉంటుంది. ఇలా వేసవి తాపాన్ని తీర్చే పండ్లలో కర్భూజ కూడా ఒకటి. పేదవాడికి కూడా అందుబాటు ధరలో లభించే ఈ పండులో బోలెడు పోషకాలు ఉన్నాయి అవేంటో ఒకసారి చదవండి. అపుడు కర్భూజ గూర్చి మీ అవగాహన ఎంతుందో మీకే తెలుస్తుంది.
విటమిన్-ఎ, విటమిన్-సి కాల్షియం, పాస్పరస్, ఐరన్, పొటాషియం, కెరోటిన్, ఫైబర్, కొవ్వులు, ప్రోటీన్లు కలిగి ఉన్న కర్భూజ పండులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. మాగేకొద్ది మధురమైన వాసనను వెదజల్లే కర్బూజ పండు గొప్ప రుచిని కలిగి ఉంటుంది. అయితే ఇక్కడ ఇస్తున్న విషయాలు చదివి కర్బూజా గూర్చి మీకు ఎంతమాత్రం తెలుసో ఒకసారి టెస్ట్ చేసుకోండి.
◆కర్బూజా పండు ముదురు గోధుమ లేదా లేత ఆకుపచ్చని రంగులో గోధుమవర్ణపు మందమైన పొట్టును కలిగి ఉంటుంది. లోపల పండు పసుపు లేదా లేత నారింజ రంగు కలిగి ఉంటుంది. ఇందులో 92% నీరు నిండి ఉంటుంది. అందుకే కర్బూజా తిన్నపుడు తొందరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీని తీసుకోవడం వల్ల దాహాన్ని అరికట్టవచ్చు.
◆ఇందులోని విటమిన్-ఎ, విటమిన్-సి లు మన శరీరంలోని టాక్సిన్లను సమర్థవంతంగా బయటకు పారద్రోలి శరీరంలో తేమను బ్యాలెన్స్ చేస్తాయి. విటమిన్ ఎ కంటి చూపుకు మరియు చర్మ సంరక్షణకు తోడ్పడుతుంది. అలాగే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

◆కర్బూజ పండులో లభ్యమయ్యే అత్యల్ప కొవ్వులు మన గుండెకు ఎంతో మంచి చేస్తాయి. లేకోపెన్ అని పిలువబడే ఇది గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.
◆మన శరీరంలో రక్తంలో చేరిన చక్కెరలు క్రమబద్దీకరించడంలో కర్బూజ చాలా బాగా పని చేస్తుంది. దీనివల్ల మధుమేహాన్ని రాకుండా చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
◆జీర్ణవ్యవస్థను అస్తవ్యస్తం చేసే అజీర్తి, ఎసిడిటీ వంటి సమస్యలను నివారించడంలో కర్భూజ తోడ్పడుతుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ లను మాన్పడంలో ఇది ఉత్తమ సహాయకారి. కిడ్నీలో రాళ్లను కరింగించగల కర్బూజా ను తీసుకోవడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం పదిలంగా ఉంచుకోవచ్చు.
◆కర్బూజా లో నీటి శాతం అధికమని చెప్పుకున్నాం కాబట్టి దీనిని తీసుకోవడం వల్ల అధికబరువును నివారించవచ్చు. ఇందులో ఉన్న చెక్కరలు కూడా తొందరగా జీర్ణమైపోయేవే కాబట్టి నిస్సందేహంగా డైటింగ్ లో చేర్చుకోవచ్చు.
◆ఇందులో లభించే విత్తనాలకు ఉన్న గొప్ప గుణం వీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది మన పొత్తి కడుపులో పేరుకున్న కొవ్వులను కరిగించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
◆కర్బూజ విత్తనాలను స్వీట్లు, పాయసాల్లో వాడతారు. వీటిని ఉత్తివే వొలుచుకుని తింటారు కూడా.
◆సాదరణంగా అందరిలో ఎదురయ్యే మలబద్దకం ను కర్భూజ చక్కగా నివారించగలుగుతుంది. అలాగే కర్బూజ ను తీసుకోవడం వల్ల నోటి అల్సర్ లు తొందరగా తగ్గుతాయి.
◆కర్బూజాలోని ప్రోటీన్ల వల్ల మన శరీరంలో దెబ్బతిన్న కండరాలు తిరిగి పూర్వపు రూపానికి వస్తాయి. అలాగే నరాలు కూడా చురుగ్గా మారతాయి.
చివరగా…….
ఇన్ని చెప్పుకున్న కర్భూజ గూర్చి మరొక విషయం. కర్బూజా తొక్క కూడా గమ్మత్తైన రహస్యాన్ని దాచుకుంది అదేమిటంటే కర్భూజ తొక్కను నీటిలో ఉడికించి ఆ నీటిని మాత్ వాష్ గా ఉపయోగించవచ్చు మరియు ఈ నీరు పంటి నొప్పిని నివారించడంలో సమర్థవంతంగా పని చేస్తుంది. మరి మీకెంత తెలుసో ఇపుడు ఆలోచించండి.