గర్భవతులు అవడం, ఒక బుజ్జాయి ఇంటికి రావడం ప్రతి స్త్రీకి ఒక కల. ఆ కల నెరవేరే సమయంలో ఎలాంటి సూచనలు ఉంటాయి. ప్రతి ఒక్కరికీ ఈ విషయమై అనేక సందేహాలు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీ రావడానికి ముందు కొన్ని సూచనలు కనిపిస్తాయి. ఇవి అందరిలో ఒకేలా ఉండకపోవచ్చు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క లక్షణం ఉండవచ్చు. అది కూడా ప్రతి ఒక్కరి తత్వాన్ని బట్టి ఒక్కో లక్షణం బయటపడుతుంటాయి. ఈ లక్షణాలు లేనప్పుడు కూడా కొంతమందిలో గర్భవతి అయ్యే అవకాశం ఉంది.
ఎక్కువగా కనిపించే కొన్ని లక్షణాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెలసరి రావడం ఆలస్యం అయితే పదిరోజుల దాటగానే వెంటనే డాక్టర్ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. కొంత మందిలో ఏ వంట చేసినా ఆ వాసన పడకపోవడం, తినే తిండి సహించకపోవడం, కొన్ని పదార్థాలు చూస్తూనే వాంతులు వచ్చినట్లు ఉండడం, వికారం, తలనొప్పి, తల తిరగడం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే శరీరంలో నొప్పులు, కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. యుటేరస్లో పిండం స్థిరపడేటపుడు ఇలా నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కొంతమందిలో హార్మోనల్ చేంజెస్ వస్తే దాని వలన శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి. గర్బవతులుగా ఉన్నప్పుడు బ్రెస్ట్ గట్టిగా ఉండడం, కొంచెం స్తనాల సైజ్ పెరగినట్టు ఉండడం, నొప్పి రావడం, నిపుల్స్ చుట్టూ రంగుమారడం లేదా సున్నితంగా మారడం వంటివి కనిపిస్తాయి. కొంతమందికి PMS అంటే ప్రీ మెనుస్ట్రువల్ సిండ్రోమ్ లక్షణాలు కూడా ఇలాగే ఉంటాయి. కానీ PMS లక్షణాలు రెండు, మూడు రోజుల్లో తగ్గిపోతాయి.
ఎక్కువ రోజులు కొనసాగితే డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. అంతేకాకుండా గర్భంతో ఉన్నప్పుడు అస్తమానం మూత్రానికి వెళ్ళవలసి రావచ్చు. గర్బంలో పిండం చేరిన రెండు వారాల నుండి బ్లాడర్పై ఒత్తిడి పెరుగుతుంది. దాంతో మూత్రానికి వెళ్ళవలసి వస్తుంది. మామూలు సమయంలో పలచగా ఉండే వైట్ డిఛార్జ్ గర్బవతులుగా ఉన్నప్పుడు చిక్కగా మారుతుంది. శరీర ఉష్ణోగ్రతల్లో మార్పులు కొన్ని రోజులు ఒకేసమయంలో ఉండడం వంటి లక్షణాలు ఎక్కువ రోజులు ఉన్నప్పుడు వెంటనే డాక్టరును సంప్రదించాలి.