ఒకప్పటి శ్రమైకజీవనం ప్రస్తుతం చాలావరకు తగ్గిపోయింది. మానసిక శ్రమ తప్ప శారీరక శ్రమ కనిపించని ఈ కాలంలో జీవన విధానానికి తగ్గట్టు ఆహారం తీసుకోవడం లేదన్నది ఒప్పుకోక తప్పని వాస్తవం. అయితే ఇప్పటికైనా మించిపోయినది ఏమి లేదు, ఆహారంలో మార్పులు, ఆహారం ఆవశ్యకత గూర్చి తెలుసుకుంటే ఆరోగ్యాన్ని కాడుకోవడం చాలా సులువు. కాబట్టి ఆరోగ్యానికి ఉత్తమ ఆహారం ఏమిటో ఒకసారి చదివేయండి.
◆ ప్రస్తుత కాలంలో సిటీల నుండి గ్రామాల వరకు అందరిని పట్టుకున్న జబ్బు జంక్ ఫుడ్స్. జీర్ణశక్తి సమర్థవంతంగా ఉండి, ఎపుడో ఒకసారి సరదాగా తీసుకునే ఉద్దేశ్యం ఉంటే జంక్ ఫుడ్ ను తీసుకోవచ్చు. అంతే కాని రోజూ దీనివెంట పడితే ఆరోగ్యానికి పెద్ద తంటా తెచ్చి పెడుతుంది.
◆ సాధారణంగా ఆహారం తీసుకునేటప్పుడు మన రోజువారీ శారీరక శ్రమను గుర్తుపెట్టుకొని ఆహారంలో కేలరీల పరిమాణాన్ని అనుసరించి ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం.
◆ పులుసు కూరలు వారంలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే వండుకోవాలి. ఎందుకంటే వీటిలో చింతపండు ఎక్కువ వాడుతుంటారు కాబట్టి తక్కువగా వండుకోవాలి.
◆ సంబారాలు అంటే ధనియాలు, జీలకర్ర, మిరియాల లాంటి దినుసులు. వీటిని వాడి మనం సాంబార్ చేసుకుంటాం. అయితే ప్రస్తుతం సాంబార్, చారు అనేవి కేవలం చింతపండు రసాన్ని అధిక మొత్తంలో వాడి చేస్తున్నారు కాబట్టి వీటిని తగ్గించుకుని వాడుకోవడమే ఉత్తమం.
◆ చింతపండుకు బదులుగా ఉసిరికాయ, లేదా పాత చింతకాయ తొక్కు వంటివి వాడుకోవాలి. ప్రస్తుతం కోల్డ్ స్టోరేజి లో నిల్వ ఉంచిన చింతపండు మార్కెట్ లో లభిస్తుంది. కొత్త బియ్యం, కొత్త చింతపండు అనేవి ఆరోగ్యానికి అంత మంచివి కావు.
◆ ఏ ఆహార పదార్థమైనా వండుకునేటపుడు తక్కువ మంట మీద వండుకోవడం శ్రేయస్కరం, దీనివల్ల పోషకాలు ఎక్కువ నశించకుండా ఉంటాయి. నూనెలు ఎక్కువ అవసరం అయ్యే వేపుళ్ళ జోలికి వెల్లకపోవడం ఉత్తమం.
◆ నిల్వ ఉంచిన ఊరగాయ పచ్చళ్ళు కూడా రుచి కోసం అపుడపుడు తినాలి. అస్తమాను వాటిని తింటూ ఉండటం ఆరోగ్యానికి మంచిది కాదు.
◆ సాంబార్, ఇడ్లి, పెరుగు వడ, దోశ వంటి పలహారాలు తిన్న తరువాత కాఫీ లేదా టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇది పూర్తిగా ఆరోగ్యానికి విరుద్ధమైన అలవాటు. దీనివల్ల కడుపులో ఎలర్జీలు, జీర్ణసంబంద వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
◆ బీర, పొట్ల, సొర, తోటకూర, పాలకూర, కొయ్య తోటకూర, పొన్నగంటి కూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, క్యారెట్ వంటివి వండుకోవడానికి చింతపండు వాడనవసరం లేదు కాబట్టి. చింతపండు మినహాయించి వండుకుంటే గొప్ప ప్రయోజనాలు చేకూరుతాయి.
◆ ఉప్పు, కారం, పులుపు ఎంత తక్కువ ఉంటే ఆ హరమ్ అంత గొప్పగా ప్రయోజనాలు చేకూరుస్తుంది.
◆ మనకంటూ తీసుకునే ఆహారం పట్ల స్పృహ ఉండాలి. దీనివల్ల ఆరోగ్యకరమైన ఆహారాన్నే ఎక్కువగా భాగం చేసుకోగలుగుతాము.
చివరగా……
ఆహారం విషయంలో ఎపుడూ రాజీలేని నిర్ణయాలు తీసుకుంటూ వాటినే అనుసరిస్తూ ఉంటే తప్పకుండా సంపూర్ణ ఆరోగ్యం వైపు మన అడుగులు వెళతాయి.