Gasagasalu Health Benefits of Poppy Seeds

గసగసాల సరసాలు గమ్మత్తైన ఆరోగ్య రహస్యాలు.

ఇపుడంటే పిండివంటలు తక్కువ గానీ ఒకప్పుడు పిండి వంటలు అంటే బొబ్బట్లు, అరిసెలు, పూర్ణాలు, జంతికలు, పాయసం, లడ్డు అబ్బో ఈ తీపి వంటల చిట్టా ఇలా ముగించలేం.  చాలామందికి ఇప్పట్లో పిండి వంటలు అంటే గులాబ్ జామున్, కాసింత సెమియా కేసరి తో సరిపెడుతుంటారు. అయితే ఒకప్పటి వంటల్లో విరివిగా నెయ్యి, నువ్వులు, గసగసాలు, బెల్లము ఉపయోగించేవారు. ఇందులో ముఖ్యంగా గసగసాలు సన్నని గింజల్లా ఉండి నమిలితే లేత తీపి రుచిని కలిగి ఉంటాయి. వీటిని కాసింత నీరు జతచేర్చి రుబ్బితే తెల్లగా పాలు గా చిక్కగా అవుతాయి. తీపి వంటలకు అద్భుతమైన రుచిని అందించే ఈ గసగసాలు కేవలం రుచినే కాదు గొప్ప ఆరోగ్యాన్ని కూడా దాచుకున్నాయ్. ఆ ఆరోగ్య రహస్యాలు ఏమిటో తెలుసుకుంటే ఇప్పటి తరం కూడా గసగసాలు వాడేసి ఆరోగ్యాన్ని మిసమిసలాడించవచ్చు. 

◆ జీలకర్ర, గసగసాలు సమానంగా తీసుకుని  ఉప్పు, కారం కలుపుకుని పొడిచేసి నిల్వచేసుకోవాలి. దీన్ని రోజూ అన్నంలో కలుపుకుని తింటే జిగురు విరేచనాల బారిన పడ్డ వారికి ఉపశమనం లభిస్తుంది.  కొందరికి భోజనం చేయగానే విరేచనానికి వెళ్లాల్సిన అవసరం వస్తుంది. అలాంటి వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించవచ్చు.

◆ గసగసాలు శుక్రధాతువుని పెంచి లైంగిక శక్తిని వృద్ధి చేస్తాయి. ఇవి శరీరానికి దృఢత్వాన్ని కలిగిస్తాయి. వాత దోషాల్ని పోగొట్టడంలో గొప్పగా దోహాధం చేస్తాయి. కుష్ఠురోగాలలో, నిమ్ము పట్టిన సమస్యలలో గసగసాలు పథ్యం మంచి పలితాన్ని ఇస్తుంది.

◆ గసగసాలు పండే కాయలను పోస్తు కాయలు అంటారు, వీటి నుండి గసాగసాలను తీస్తారు. ఈ కాయలకు ఘాటు పెడితే పాలు కారతాయి,  ఈ పాలలో నుంచే  నల్లమందు తీస్తారు.

◆ తామర, గజ్జి, దురద, పొక్కులు మీద రాస్తే తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి ఈ సమస్యలతో బాధపడుతున్నవారు వాడుకోవచ్చు.

◆ గసాగసాలను తీసుకోవడం వల్ల మలబద్దకం రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా వాత వ్యాధులన్నింటికి ఇది పథ్యంగా పనిచేస్తుంది కాబట్టి వాత సమస్యలు ఉన్నవారు నిరభ్యరంతంగా తీసుకోవచ్చు.

◆ గసాగసాలను పాలతో నూరి పేస్టులా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అయితే గసాగసాలను అతిగా తీసుకుంటే మత్తుగా ఉంటుంది మరియు మూత్రం సాఫీగా జరగడంతో ఆటంకాలు కలిగించే అవకాశం కూడా ఉంది. 

◆ సాధారణంగా గసగసాల పాలుగా పిలుచుకునే దాన్ని గసాగసాలలో నీళ్లు జతచేర్చి గ్రైండ్ చేయడం ద్వారా తెల్లని పాలు వస్తాయి. వీటినే గసగసాల పాలు అంటారు.  ఈ పాలలో పంచదార కలిపి తాగితే విరేచనాలు వెంటనే తగ్గుతాయి. 

చివరగా……

గసాగసాల పాయసం, అరిసెలపై లేతగా కాలి అందంగా ఆకర్షించినా, బొబ్బట్లతో చేరి లొట్టలు వేయించిన ఎన్ని రకాలుగా వాడిన అద్భుతమైన రుచిని ఇస్తూ ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. అయితే అతిగా మాత్రం వాడకూడదు సుమా…..

Leave a Comment

error: Content is protected !!