Healthy Diet Plan During Pregnancy

గర్భవతులు ఈ ఆహారం తీసుకుంటే పండంటి బిడ్డ పుడతాడు

ప్రతి ఆడపిల్ల జీవితం పెళ్లితో కొత్త మలుపులు తీసుకుంటుంది. ముఖ్యంగా పెళ్లయ్యాక గర్భం ధరించడం, ప్రసవం మాతృత్వపు భావనను గుండెల్లో నింపుతుంది. అయితే చాలా మంది అమ్మాయిలు గర్భం దరించినపుడు ఆరోగ్యం పట్ల కాస్త నిర్లక్ష్యంగా ఉంటారు. ఆర్థిక కారణాలు కావచ్చు మరొకటి కావచ్చు కానీ సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కడుపులో పెరుగుతున్న బిడ్డకు సరైన పోషకాలు అందక, బలహీనత, అవయవలోపం , పోషకాహార లోపం కలిగిన జబ్బులతో పుట్టడం, రోగనిరోధక శక్తి తక్కువగా కలిగి ఉంటడం వంటి సమస్యలతో పుడతారు. దీనివల్ల పిల్లలు పుట్టిన రోజులు లేదా నెలలలోపే మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల గర్భవతులు ఏ విధమైన ఆహారం తీసుకోవాలి అది కడుపులో బిడ్డకు ఎలా మేలు చేస్తుంది ఒకసారి తెలుసుకోండి

తీసుకోవలసిన ఆహారం

◆ప్రతి మనిషి సమతులాహారం తీసుకోవాలి. అయితే గర్భవతులకు అదనపు పోషకాలు అవసరం. అలాగే సాధారణంగా ఉన్నపుడు తీసుకునే ఆహార పదార్థాలలో కొన్నింటిని మినహాయించాల్సి ఉంటుంది

◆ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు తగినంత తీసుకోవడం ఉత్తమం. వాటికోసం పాలు, డ్రై ఫ్రూట్స్ ఉత్తమమైనవి. పాలలో కుంకుమ పువ్వు కలిపి తీసుకోవడం అనేది ఎప్పటినుండో వస్తున్న పద్దతి.

◆కార్బోహైడ్రేట్లు తీసుకోవడం వల్ల శక్తిని కండర పుష్టిని పొందవచ్చు ఇది కడుపులో బిడ్డ ఎదుగుదలకు గొప్పగా పనిచేస్తుంది. పప్పు దినుసులు, పిండిపదార్థాలు పుష్కాలంగా లభించే వేరుశనగ, శనగలు, పెసలు వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి

◆మొలకెత్తిన గింజల్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. గర్భవతులను సాధారణంగా వేధించే సమస్య మలబద్దకం. అయితే మొలకెత్తిన గింజలను రోజు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల పీచు పదార్థాలు పుష్కలంగా అంది జీర్ణవ్యవస్థ సమర్థవంతంగా ఉంటుంది. దీనివల్ల శారీరక అసౌకర్యత తొలగిపోయి కడుపులో బిడ్డ పెరుగుదలను సంతోషంగా అనుభూతి చెందగలుగుతారు.

◆గర్భవతులుగా ఉన్నపుడు సాధారణంగా బరువు పెరుగుతూ ఉంటారు. కారణం మాములు కంటే ఎక్కువ ఆహారాన్ని తీసుకోవడం. పెద్దలు కూడా నీకే కాదు కడుపులో బిడ్డకు కూడా అంటూ ఎక్కువ తినమని చెబుతుంటారు. అయితే చిన్న చిట్కా వల్ల బరువును అదుపులో వుంచుకోవచ్చు. తీసుకునే ఆహారాన్ని రోజులో మూడు పూటలా కాకుండా మరిన్ని సార్లు ఎక్కువగా, తీసుకునే ప్రతి సారి కొద్దీ మొత్తంలో తినాలి. అంటే మూడు గంటలకు ఒకసారి అయినా కొద్ది మొత్తంలో ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే శరీరానికి కావలసిన పోషకాలు అందడంతో పాటు బరువును కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చు.

◆గర్భవతుల్లో రక్తం సరిపడినంత లేకపోతే ప్రసవ సమయంలో ప్రమాదం చోటు చేసుకుంటుంది. అందువల్ల రక్తాన్ని పెంచే బీట్రూట్, క్యారెట్ జ్యుస్ లు రోజువారీ తీసుకుంటూ ఉండాలి. అంతే కాదు ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ లు పుష్కలంగా అందితేనే కడుపులో బిడ్డ సరిపడినంత బరువు మరియు బలంగా పుట్టే అవకాశం ఉంటుంది.

◆చాలా మందికి కాఫీ,టీ లు తీసుకునే అలవాటు ఉంటుంది. అయితే గర్భవతులు కాఫీ, టీ లకు దూరంగా ఉండాలి. వీటిలోని కెఫిన్ వివిధ ఆహారాలు ద్వారా అందే ఐరన్ ను నిర్వీర్యం చేస్తుంది. కాబట్టి కాఫీ టీ లకు దూరం ఉండటం శ్రేయస్కరం.

◆పాలు, చేపలు, గుడ్లు, మసం వంటివి తీసుకోవడం వల్ల దేహపుష్టి సాధ్యపడుతుంది. అయితే వీలైనంత వరకు మసాలాలు, అధిక కారం, అధిక పులుపు వంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే బిపి ని నియంత్రణలో ఉంచుకోవాలి. 

చివరగా…..

గర్భవతులు కూడా సాధారణంగా ఉన్నపుడు ఎలా ఉండేవారో అలాగే ఉంటూ కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా ఆహారం కంటే మనసు ఆనందంగా ఉండటంగా గొప్ప బలాన్ని ఇస్తుంది కాబట్టి ప్రసవం జరిగే వరకు వేటిని ఎక్కువగా ఆలోచించకుండా కడుపులో బిడ్డ ఇచ్చే కదలికలను ఆస్వాదించడం వల్ల పండంటి బిడ్డ మీ ఇంట అల్లరి చేయడం తధ్యం.

Leave a Comment

error: Content is protected !!