కాళ్ళలో చేతుల్లో తిమ్మిర్లు సరైన పద్ధతిలో కూర్చోకపోవడం, కదలిక లేకపోవడంతో కొన్ని నరాలపై ఒత్తిడి పడి రక్తప్రసరణ జరగక కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు ఏర్పడతాయి. కొందరికి మధుమేహం వలన నరాల పైపొర దెబ్బతిని కాళ్ళలో తిమ్మిర్లు, మంటలు ఏర్పడతాయి. అనుకోకుండా కాళ్ళు, చేతులు మొద్దుబారడం, సూదులు గుచ్చినట్టు ఉండడం, స్పర్శ కోల్పోయి అడుగుతీసి అడుగు వేయడం కూడా కష్టమవుతుంది. ఇలాంటప్పుడు అటు ఇటూ నడవడం వలన తగ్గిపోతుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.
ఇది అందరిలో అప్పుడప్పుడు రావడం సహజమే. అదే వారాల తరబడి వేధిస్తుంటే అవి శరీరంలో ఉన్న తీవ్రవ్యాధులకు సంకేతంగా చెప్పొచ్చు. శ్రద్ధ పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తే నరాలు తీవ్రంగా దెబ్బతినొచ్చు అనేది డాక్టర్ల అభిప్రాయం. థైరాయిడ్, కిడ్ని సమస్యలు, అధిక బరువు, కండరాలపై అధిక ఒత్తిడి, కాల్షియం లోపం, గర్భవతులు ఈ సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు. అలాగే డీ హైడ్రేషన్ కూడా కారణమవుతుంది. నీటిని శరీరానికి సరిపడా తాగాలి. ఈ సమస్యకు ముఖ్యకారణం విటమిన్ బి12, మెగ్నీషియం, పొటాషియం లోపం.
నరాల వ్యవస్థ బాగా పనిచేయడానికి విటమిన్ బి12 లోపాన్ని సవరించాలి. లేదంటే శరీరంలో కణజాలం సరిగా పనిచేయక తిమ్మిర్లతో బాధపడతాం. మనం రోజూ తీసుకునే ఆహారంలో అందే విటమిన్ బి 12 శరీరానికి సరిపడా తీసుకుని మిగిలినది మలమూత్రాలతో బయటకు పోతుంది. కొన్నిసార్లు శరీరం విటమిన్ బి12 ను ఆహారం నుండి శోషించకపోవడం కూడా కారణం కావచ్చు. కనుక రోజూ విటమిన్ బి 12 ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
ఈ విటమిన్ పాలు, మాంసాహారం, పన్నీర్, గుడ్లలో ఎక్కువగా లభిస్తుంది. వెజిటేరియన్స్, పాల సంబంధిత పదార్థాలు తినని వారు పప్పు ధాన్యాలు, బఠాణీ, రాజ్మా లాంటివి బాగా తినడం ద్వారా పొందవచ్చు. అలాగే ఎప్సం సాల్ట్ వేడినీటిలో వేసుకుని స్నానం చేయడం వలన కండరాలకు ఉపశమనం లభించి తిమ్మిర్లు తగ్గుతాయి. కొద్దిపాటి వ్యాయామం, క్రమం తప్పని నడక తిమ్మిర్లు తగ్గడానికి ఉపయోగపడతాయి. రాత్రుళ్ళు పడుకునే ముందు మెగ్నీషియం అధికంగా ఉండే నూనెతో మసాజ్ చేయడం కూడా ఉపకరిస్తుంది.