నారింజ, కమలా, ఆరంజ్ అన్ని ఒక పండు పేరే అని మనకు తెలుసు. ఆరెంజ్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది, పై తొక్క నుండి రసం వరకు ఈ పండులో ప్రతీది గొప్ప ప్రయోజనాలను చేకూర్చేదే. ముఖ్యంగా సౌందర్య ఉత్పత్తులలో నారింజ తొక్కల పొడి విరివిగా వాడుతుంటారు. ఇందులో రిచ్ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం సున్నితంగా మరియు మెరుగ్గా ఉండటానికి సహాయపడుతుంది. గొప్ప యాంటీ ఏజింగ్ సప్లిమెంట్ గా కూడా నారింజ తొక్కల పొడి పని చేస్తుంది. అలాంటి నారింజ తొక్కతో అబ్బురపరిచే టిప్స్ కొన్ని చెప్పుకునేముందు అందులో పోషకాల గూర్చి తెలుసుకోండి.
◆ విటమిన్ సి: మొటిమలతో పోరాడుతూ ఆరోగ్యకరమైన చర్మం పొందడంలో సహాయపడుతుంది
◆ కాల్షియం: మృతకణాలతో కూడిన చర్మాన్ని తిరిగి జీవం వచ్చేలా చేస్తుంది.
◆ పొటాషియం: చర్మాన్ని తేమ చేస్తుంది, చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది
◆ మెగ్నీషియం: మెరుస్తున్న చర్మం కోసం ఇది ఉత్తమమైనది. అలాగే యవ్వనంగా ఆరోగ్యంగా ఉంచుతుంది.
నారింజ తొక్కతో అబ్బురమైన ఫేస్ పాక్ లు.
పెరుగు మరియు తేనె తో ఆరెంజ్ ఫేస్ పాక్
కావలసినవి:
◆ 2 టీస్పూన్లు నారింజ పై తొక్క పొడి
◆ 1 టీస్పూన్ తేనె
◆ 1 టీస్పూన్ పెరుగు
విధానం: అవన్నీ ఒక గిన్నెలో కలపాలి. ముఖం మీద మందపాటి పూతగా వేయాలి. అది ఎండిపోయే వరకు 15 నిమిషాలు అలాగే ఉంచాలి. తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
పెరుగు సహజ మాశ్చరైజర్ గా పనిచేస్తుంది, చనిపోయిన మృతకణాలను తొలగించి కొత్త కణాలు ఏర్పడటంతో సహాయపడుతుంది. ఇక తేనె చర్మానికి తేమను అందించి చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది. నారింజ తొక్కలో ఉన్న గుణాలు చర్మానికి మెరుపును, మంచి రంగును అలాగే నల్ల మచ్చలు, మంగు వంటి వాటిని తొలగిస్తుంది.
వోట్ మీల్ ఫేస్ మాస్క్
మొటిమలను దూరంగా ఉంచడానికి, నారింజ పై తొక్క మాస్క్ ఉపయోగించచ్చు. ఇది దుమ్ము, ధూళి మరియు జిడ్డుగా ఉన్న చర్మ రంధ్రాలను కూడా శుభ్రపరుస్తుంది మరియు బ్లాక్ హెడ్స్ ను కూడా నివారిస్తుంది.
కావలసినవి:
◆ఆరెంజ్ పై తొక్క పొడి: 2 టీస్పూన్లు
◆ వోట్ మీల్: 1 టీస్పూన్(ఓట్స్ పౌడర్)
◆ బేకింగ్ సోడా: 1 టీస్పూన్
విధానం: అన్నిటినీ కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించి వృత్తాకారంగా మెల్లిగా మసాజ్ చేసుకోవాలి. తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఆరెంజ్ పీల్ షుగర్ స్క్రబ్:
ఇక్కడ ఆరెంజ్ తొక్క పొడి కూడా అవసరం లేదు, నేరుగా తాజా ఆరెంజ్ తొక్కను ఉపయోగించవచ్చు.
కావలసినవి:
◆తాజా నారింజ తొక్క
◆చక్కెర
◆కొబ్బరి నూనే
◆తేనె
విధానం: ఒక గిన్నెలో కొంచెం చక్కెర వేసి, కొంత ఆరెంజ్ తొక్కను తురుముకుని చక్కరలో కలపాలి. ఇపుడు అందులో తేనె, తరువాత కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. దీన్ని ముఖానికి పట్టించి రుద్దుతూ మసాజ్ చేసుకోవాలి.
చక్కెర స్క్రబ్ చేయడానికి ఎంతో ఉత్తమంగా తోడ్పడుతుంది. సాగిన చర్మాన్ని, ఎక్కువగా తెరచుకోబడిన చర్మ రంద్రాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడంలో సహాయపడుతుంది.
ఆరెంజ్ పీల్ మాస్క్
చాలా సులువుగా ఆరెంజ్ తొక్క పొడితో పాక్ వేసుకోవాలి అనుకునేవాళ్లకు ఇది మంచి టిప్. కేవలం ఆరెంజ్ తొక్కల పొడి మరియు పాలు కలిపి ముఖం మెడపై అప్లై చేసి దాదాపు 20 నిమిషాలు అలాగే వదిలేయాలి. తరువాత ముఖాన్ని కడుక్కోవాలి.
ఫేస్ క్లీనింగ్ మాస్క్:
ఆరెంజ్ పై తొక్క చర్మంలో ఉన్న అదనపు నూనెను గ్రహిస్తుంది, మరియు చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.
కావలసినవి:
◆ నారింజ పై తొక్క పొడి 2 టీస్పూన్లు
◆ 1 టీస్పూన్ పాలు
◆ 1 టీస్పూన్ కొబ్బరి నూనె
అన్నిటినీ కలిపి ముఖానికి పాక్ వేసుకోవాలి. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మం అందంగా మరియు మృదువుగా ఉండేలా చేస్తుంది.
చివరగా….
ఈ ఫేస్ పాక్ లలో ఉయోగించిన పదార్ధాలన్నింటికీ వాటిలో ఉన్న పోషకాల శక్తి ఉంటుంది. వీటిని ఇలా ఉపయోగించడం వల్ల చర్మం మీది అతి జిడ్డు, దుమ్ము, ధూళి వల్ల ఏర్పడే మొటిమలు, వీటి తాలూకూ మచ్చలు, సాగిన చర్మం మొదలైన అన్ని సమస్యలు చక్కబడతాయి. మరింకెందుకు ఆలస్యం ఆరెంజ్ తినగానే తొక్కలను అపురూపంగా దాచేసుకోండి.