నిద్రపోతున్నపుడు గురక పెట్టడం చాలా ఇళ్లలో కనిపించే సాధారణ సమస్య. ప్రతి ఇంట్లో ఈ గురక పెట్టె వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. వారి వల ఇంటిల్లిపాది ఇబ్బంది పడుతూ ఉంటారు. అంత ఇబ్బంది పడినా దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. గురక పెట్టేవారిలో 75% మందికి అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఉంటుంది. ఇది గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ గురకకు వైద్యులను సంప్రదించడం ముఖ్యమైనదే అయినప్పటికీ సహజంగా పాటించే కొన్ని చిట్కాలతో సమస్యకు చెక్ పెట్టవచ్చు. అవేంటో చూడండి.
నిద్రపోయేటపుడు భంగిమ మార్చుకోవడం
వెల్లకిలా పడుకోవడం వల్ల నాలుకకు మరియు అంగిలికి మధ్య ఉన్న ఖాళీలో నాలుక జారినట్టు అవుతుంది, ఇది నిద్రలో గాలి పీల్చుకునేటపుడు మరియు వదిలేటపుడు కంపిస్తుంది. కాబట్టి వెల్లకిలా పడుకోవడం మానుకోవాలి. ఒకవైపుకు తిరిగి పడుకోవడం ఉత్తమం.
బరువు తగ్గడం
బరువు తగ్గడం కొంతమందికి సహాయపడుతుంది కాని అందరికీ కాదు. బరువు పెరిగిన వాళ్లలో ఈ గురక సమస్య అనేది చోటు చేసుకున్నపుడు అధిక బరువు తగ్గడం దీనికి పరిష్కారం గా చెప్పుకోవచ్చు. బరువు తగ్గడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెప్పనవసరం లేదు కదా. మెడ చుట్టూ బరువు పెరిగితే అది గొంతు వ్యాసంపై ప్రభావం చూపిస్తుంది, ఇదే గురకగా మారే అవకాశం ఉంటుంది.
మద్యపానాన్ని మానుకోవాలి
ఆల్కహాల్ మరియు మత్తుమందులు మీ గొంతు వెనుక భాగంలోని కండరాల సామర్థ్యాన్ని తగ్గిస్తాయి, దీనివల్ల గురక చోటుచేసుకుంటుంది. “నిద్రపోయే ముందు మద్యం తాగడం గురకను మరింత పెంచుతుంది” గురక లేని వారు కూడా మద్యాన్ని సేవించడం వల్ల గురక బాధితులు అవుతారు.
నిద్ర విషయంలో జాగ్రత్తలు
నిద్ర అలవాటు కూడా గురకకు కారణం అవుతుందంటే ఆశ్చర్యం వేస్తుంది కానీ ఇది నిజం. మద్యం తాగడం మాదిరిగానే నిద్ర అలవాట్లు కూడా ప్రభావం చూపుతాయి. తగినంత నిద్ర లేకుండా ఎక్కువ గంటలు పనిచేయడం, రోజులో నిద్రకు తగినంత సమయాన్ని కేటాయించకపోవడం, తక్కువ నిద్రపోతూ ఎక్కువ శారీరక శ్రమ చేయడం వల్ల కండరాలు బలహీనం అవుతాయి. వాటికి విశ్రాంతి లేకపోవడం వల్ల గొంతు బాగంలో శ్వాస సమస్య తలెత్తి గురకను సృష్టిస్తుంది
ముక్కు రంద్రాలు విషయంలో జాగ్రత్తలు అవసరం.
ఊపిరి తీసుకోవడం ఎలాంటి సమస్య లేకుండా సాగాలి. ముక్కు రంద్రాలలో గాలి ప్రసరణ ఇబ్బందిగా ఉంటే గురకకు దారి తీస్తుంది. జలుబు లేదా ఇతర అడ్డంకులు కారణంగా ముక్కు రంద్రాలు ఇరుకైనట్లయితే, వేగంగా శ్వాశ జరపడం గురక పుట్టేలా చేస్తుంది. ఉప్పు-నీటితో ముక్కు రంధ్రాలను శుభ్రం చేసుకోవాలి. ఇది మంచి పలితాన్ని ఇస్తుంది.
దిండు కవర్ మార్చడం
పడకగదిలో దిండు కవర్ ను తరచూ మారుస్తూ ఉండాలి. దిండు కవర్ మీద బాక్టీరియా, మురికి వల్ల కూడా శ్వాస సంబంధ సమస్యలు ఎదురై గురక రావచ్చు, అలాగే సీలింగ్ ఫాన్ ను ఎప్పటికపుడు శుభ్రపరుస్తూ ఉండాలి. లేకపోతే ఫ్యాన్ వేసినప్పుడు దుమ్ము గది మొత్తం వ్యాప్తి చెంది శ్వాశకు ముఖ్యంగా శ్వాశ నాళాన్ని దెబ్బతీయవచ్చు. ముఖ్యంగా డస్ట్ అలర్జీ ఉన్నవారు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
మరొక ముఖ్య విషయం కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులను పడక గదికి దూరంగా ఉంచాలి.
శరీరాన్ని డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి
ద్రవాహారం పుష్కలంగా తీసుకోవాలి. శరీరం డీహైడ్రేట్ అయితే ముక్కులోని స్రావాలు జారిపోయి పొక్కులు కట్టి అవి శ్వాసకు ఇబ్బందిని సృష్టిస్తాయి. అలాగే గొంతు తడారిపోవడం జరుగుతుంది. అప్పటికి శ్వాస సమస్యలు ఉన్నవారికి ఇది కూడా తోడైతే గురక తీవ్ర రూపం దాల్చుతుంది. .
చివరగా….
గురక అనేది ఇబ్బంది పెడుతున్నపుడు పైన జాగ్రత్తలు పాటించి ఫలితం లేకపోతే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.