వర్షాకాలం వచ్చిందంటే అందరూ బజ్జీలపై ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. మనకు మామూలుగా మిరపకాయ బజ్జి, అరటికాయ బజ్జి ,వంకాయ బజ్జి వంటివి మాత్రమే తెలుసు. గుమ్మడికాయతో సాధారణంగా పులుసు లేదా దప్పడం మాత్రమే పెట్టుకుంటారు. కానీ ఈరోజు మనం తీపి గుమ్మడికాయలతో బజ్జీలు తయారు చేసుకోవడం నేర్చుకుందాం. తీపి గుమ్మడి అంటే చప్పదనం అసలు ఉండదు. అంతేకాకుండా ఉప్పులేని లోటు కూడా తెలియదు. పైగా దానిని శనగపిండి వేసి బజ్జీ గనక వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటాయి.
బజ్జీలు అంటే అందరికీ ఇష్టమే. కానీ అందులో ఉండే చెడు మాత్రం నూనె. నూనె లేదు అంటే హాని లేనివిధంగా ఎన్ని అయినా తినవచ్చు. నూనె లేకుండా బజ్జీలు స్పెషల్ గా గుమ్మడికాయ అయితే ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేర్చుకుందాం. దీనికి ముందుగా కావలసిన పదార్థాలు చిన్న తీపి గుమ్మడికాయ ముక్కలు, శనగపిండి రెండు టేబుల్ స్పూన్లు, పెరుగు రెండు టేబుల్ స్పూన్లు, బియ్యప్పిండి ఒక టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, తేనె ఒక టేబుల్ స్పూన్, లెమన్ జ్యూస్ ఒక టేబుల్ స్పూన్.
వాము ఒక టి స్పూన్, వంట సోడా కొద్దిగా, పసుపు కొద్దిగా, ఇప్పుడు బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా తీసుకున్న గుమ్మడికాయ ముక్కను నీటుగా విత్తనాలు తీసి పొడవుగా అర్థచంద్రాకారంలో ముక్కలు కోసుకోవాలి. వీటికి కొద్దిగా తేనె లెమన్ జ్యూస్ కలిపి రాసి ఆవిరిపై ఉడకబెట్టాలి. ఎందుకంటే నూనె లేకుండా బజ్జీలు వెసుకుంటున్నాం కనుక గుమ్మడి ముక్కలు ఉడకాలి. ఇప్పుడు బజ్జీల పిండి తయారు చేసుకుందాం. దీనికోసం ఒక గిన్నె తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసి అందులో శెనగపిండి బియ్యప్పిండి, వాము, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి.
తర్వాత పసుపు, వంటసోడా కొద్దిగా, తేనె కొద్దిగా, నిమ్మరసం కొద్దిగా వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో గుమ్మడి ముక్కలు బాగా ముంచి నాన్ స్టిక్ గ్రిల్ పైన వేసుకుని కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత మరొకవైపు కాల్చుకోవాలి. ఇలా బజ్జీలు తయారవుతాయి. వీటిని టమాటా సాస్ తో కలుపుకొని తింటే చాలా బాగుంటాయి. ఈ గుమ్మడి బజ్జీలు తినడం వలన బరువు పెరగరు మరియు కడుపు నిండుతుంది…