తొలకరి మొదలైతే ప్రకృతి చిగురిస్తుంది. పచ్చగా నవ్వుతుంది. అంతేనా ఆ ప్రకృతి లో కొత్తచిగురులు అన్ని మనసుకే కాదు ఆరోగ్యానికి కూడా భరోసా ఇస్తాయి. చిగురు అనగానే గుర్తొచ్చేది పుల్ల పుల్లగా, కాసింత వగరు రుచి నింపుకుని పేద వాడి నుండి ప్యాలెస్ లో నివసించే వాడి దాకా అందరిని తన రుచితో అలరించే చింత చిగురే. దారులకు ఇరువైపులా ఠీవీ గా నిలబడ్డ ఆ చింత చెట్ల నుండి లేలేత చింత చిగురు సేకరించి పప్పు, పచ్చడి, పులిహోర అబ్బో ఒకటా రెండా ప్రయోగాలు చేస్తే బోలెడు. అలాంటి చింత చిగురు కేవలం జిహ్వకే కాదు మీ ఆరోగ్యానికి కూడా నేను భరోసా ఇస్తాను అంటుంది. ఒకసారి చూద్దామా చింత చిగురులో ఆరోగ్య రహస్యాలేమిటో….
◆చింత చిగురు లో విటమిన్- సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి అందువల్ల ఇది గొప్ప రోగ నిరోధక వనరుగా ఉపయోగపడుతుంది. సీజన్ లో లభించే చింత చిగురును తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
◆చాలామందిని వేధించే సమస్య నోటి అల్సర్లు. కొందరికి ఎన్ని టాబ్లెట్లు మింగినా సమస్య పరిష్కారం కాదు అలాంటపుడు చింత చిగురు నీటిలో వేసి ఉడికించి దాన్ని మాత్ వాష్ గా నోట్లో వేసుకుని పుక్కిలించాలి, దీనివల్ల గొంతునొప్పి, గొంతులో మంట, అల్సర్ పుండ్లు, వాపులు అన్ని మెల్లిగా తగ్గుముఖం పడతాయి.
◆చింతచిగురు లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఫైబర్ మన జీర్ణాశయంలో సమస్యలను నిర్మూలించి జీర్ణవ్యవస్థను సమర్థవంతంగా పనిచేసేలా చేస్తుంది. దీనివల్ల చాలామందిలో ఉండే మలబద్దకం అనే సమస్య తొలగిపోయి విరేచనం సాఫీగా అవ్వడానికి ఉపకరిస్తుంది.
◆చింత చిగురులో యాంటీ ఆక్సిడెంట్లు అధికమని మనకు తెలిసిందే అయితే ఇది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండెను పదిలంగా ఉండేలా చేస్తుంది.

◆రక్తహీనతతో బాధపడుతున్నవారు చింత చిగురు తీసుకోవడం వల్ల చక్కని ఫలితాలు పొందవచ్చు. ఇది శరీరంలో ఎర్ర రక్తకణాల పెరుగుదలను పెంచముతో పాటు మాలినాలు చేరిన రక్తాన్ని ఫిల్టర్ చేసి శుభ్రపరుస్తుంది.
◆విటమిన్ సి చింతచిగురులో లభ్యమవుతుంది. జ్వరాలు ఇన్ఫెక్షన్లు, వైరస్ ల బారి నుండి రక్షణ కల్పిస్తుంది.
◆చిన్నపిల్లల్లో సాధారణంగా కనిపించే సమస్య నులిపురుగులు. దీనివల్ల పిల్లలు కడుపునొప్పి తో బాధపడుతుంటారు. చింతచిగురు ను పిల్లల ఆహారంలో భాగం చేయడం వల్ల ఈ నులిపురుగుల సమస్యను సులువుగా పరిష్కరించవచ్చు.
◆చింతచిగురు లభ్యమయ్యే కాలాల్లో పుష్కలంగా వాడటంవల్ల ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి
◆ఇప్పటి కాలంలో అందరిని వేధిస్తున్న మాధిమేహ సమస్య కూడా చింతచిగురు ను తీసుకోవడం వల్ల క్రమబద్దమవుతుందంటే చింతచిగురు ఎంత మంచి ఆరోగ్య వనరో అర్థమవుతుంది.
చివరగా…..
సీజనల్ గా దొరికే ఈ చింతచిగురును ఫ్రెష్ గా వాడుకోవడం తో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఎండించి నిల్వచేసుకుని అనారోగ్యంగా ఉన్నపుడు కారం పొడి, పప్పు, నువ్వులు, వెల్లుల్లి జతచేసి పథ్యం సమయంలో ఆహారంగా ఉపయోగిస్తారు. కాబట్టి చిట్టి ఆకును చిన్నతనంగా తీసిపడెయ్యక ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యం గూర్చి అసలు ఎలాంటి చింత అవసరం లేదు.