tomoto kottimeera rice recipe

రుచిగా త్వరగా చేసుకోగలిగే టొమాటో కొత్తిమీర రైస్ Tomato Kothimeera Rice Telugu

చాలా సింపుల్ గా ఒక పది పదిహేను నిమిషాల్లో రెడీ చేసుకుని టమోటా కొత్తిమీర రైస్ ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. తక్కువ టైం లో మంచి టేస్ట్ తో తయారు చేసుకోవచ్చు. దీనిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. రిసిపిని ఎలా తయారు చేసుకోవాలో ఈ కింది వీడియో ద్వారా తెలుసుకోండి.

టొమాటో కొత్తిమీర రైస్ తయారీ విధానం

  • స్టవ్ మీద పాన్ పెట్టి వేడి చేయండి. రెండు టేబుల్ స్పూన్లు నూనెను వేయండి.
  • ఆయిల్ వేడెక్కాక ఇందులో కొద్దిగా దాల్చిన చెక్క, నాలుగు లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, మూడు యాలుకలు వేసి కొద్దిగా వేయించండి.
  • ఇందులో ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసి వేయించండి. కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఐదారు వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా కచ్చాపచ్చాగా దంచి వేయండి. మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి నిలువుగా కోసి అందులో వెయ్యండి. రెండు ఎండు మిర్చి తుంచి వేయండి. స్టవ్ సింలో పెట్టి వీటన్నింటిని దోరగా వేయించుకోండి.
  • తరువాత దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసి వేయించండి.
  • ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలరు మారిన తర్వాత ఇందులో రెండు రెమ్మలు కరివేపాకు వేసి వేయించుకోండి.
  • ఒక మీడియం సైజు కొత్తిమీర-కట్ట ని తీసుకొని నీటుగా కడిగి మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ లా చేసుకొని ఆ పేస్ట్ ను ఇందులో కలపండి. స్టవ్ సిం లో  పెట్టుకొని ఈ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకూ వేయించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు బాగా వేయించుకోవాలి.
  • ఇప్పుడు ఇందులో రెండు పెద్ద సైజు టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని వేసుకోవాలి. తరువాత రుచికి సరిపడా ఉప్పును, ఆఫ్ టీ స్పూన్ పసుపు వేసి అన్నిటినీ బాగా కలుపుకొని పాన్ పై మూత పెట్టి స్టవ్ సిమ్ లో ఉంచి టమోటా ముక్కలు బాగా మగ్గే వరకు ఉడికించండి. ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది.
  • ఇప్పుడు ఇందులో ఒక టీస్పూన్ ధనియాలపొడి వేసి బాగా కలపండి. తరువాత ఇందులో మనము ఉడికించుకున్న రైస్ వేసి బాగా కలపండి. చివర్లో కొద్దిగా కొత్తిమీరను సన్నగా తరిగి వేసుకోండి. అంతే ఎంతో రుచికరమైన టమోటో కొత్తిమీర రైస్ రెడీ.

మీకు ఈ రెసిపీ నచ్చితే ట్రై చేసి చూడండి. ఇలాంటి మరిన్ని రెసిపీలు కోసం మా పేజీని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.

Leave a Comment

error: Content is protected !!